Pak Vs Eng: పాక్‌ తరఫున ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌! కోహ్లితో సమంగా నిలిచి! బాబర్‌ ఆజం రికార్డులివే!

23 Sep, 2022 13:46 IST|Sakshi
బాబర్‌ ఆజం(PC: PCB)

Pakistan vs England, 2nd T20I- Babar Azam Records: ఇంగ్లండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం. గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకున్న అతడు.. అద్భుత సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మరో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(51 బంతుల్లో 88 పరుగులు) కూడా బాబర్‌కు తోడు కావడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే.. ఇంగ్లండ్‌ విధించిన భారీ లక్ష్యాన్ని పాక్‌ ఛేదించింది. 203 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 

టీ20లలో రెండో శతకం
కరాచీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో వ్యక్తిగతంగా.. కెప్టెన్‌గా బాబర్‌ ఆజం పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్‌కు ఇది రెండో సెంచరీ. 

ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌
తద్వారా పాక్‌ తరఫున ఒకటి కంటే ఎక్కువ శతకాలు సాధించిన మొదటి బ్యాటర్‌గా అతడు నిలిచాడు. కాగా 2021లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బాబర్‌ ఆజం.. పొట్టి ఫార్మాట్‌లో మొదటి శతకం(122 పరుగులు) సాధించాడు.

సర్ఫరాజ్‌ రికార్డు బద్దలు
ఇక టీ20 కెప్టెన్‌గా 30వ విజయం అందుకున్న బాబర్‌ ఆజం.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పాక్‌ తరఫున 49 అంతర్జాతీయ టీ20లకు సారథిగా వ్యవహరించిన బాబర్‌ ఆజం.. 30 విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ 37 మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు సారథ్యం వహించి 29 విజయాలు అందుకున్నాడు. 

విరాట్‌ కోహ్లితో సమంగా..
ఇక టీ20 కెప్టెన్సీ రికార్డులో టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లితో సమంగా నిలిచాడు బాబర్‌ ఆజం. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా 50 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 30 మ్యాచ్‌లలో తన జట్టును గెలిపించగా.. బాబర్‌ సైతం ఇంగ్లండ్‌తో రెండో టీ20తో ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

చదవండి: CPL 2022: డుప్లెసిస్‌ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్‌లో నాలుగోది! కానీ పాపం..
Road Safety World Series 2022: సచిన్‌ క్లాస్‌..యువీ మాస్‌; ఇండియా లెజెండ్స్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు