Pak Vs Eng 4th T20: పాక్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌.. ఉత్కంఠ పోరు.. ఆఖరికి మూడు పరుగుల తేడాతో!

26 Sep, 2022 10:10 IST|Sakshi
పాకిస్తాన్‌ జట్టు(PC: PCB Twitter)

Pakistan vs England, 4th T20I- Karachi: ఇంగ్లండ్‌తో ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతం 2-2తో సమం చేసింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌, మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచాయి. ఇక కరాచీ వేదికగా ఆదివారం జరిగిన నాలుగో టీ20 ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగగా.. పాక్‌ పైచేయి సాధించింది.

టాస్‌ గెలిచి..
టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పర్యాటక జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(67 బంతుల్లో 88 పరుగులు) శుభారంభం అందించాడు. కెప్టెన్‌ బాబర్‌ ఆజం 36 పరుగులతో రాణించగా.. మసూద్‌ 21 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పాక్‌ 166 పరుగులు చేసింది.

ఆదిలోనే షాక్‌!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌, అలెక్స్‌ హేల్స్‌ వరుసగా 8, 5 పరుగులకే పెవిలియన్‌ చేరారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్‌ డకెట్‌ 33, ఐదో స్థానంలో వచ్చిన హ్యారీ బ్రూక్‌ 34 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

ఇక కెప్టెన్‌ మొయిన్‌ అలీ 29 పరుగులతో రాణించగా.. లియామ్‌ డాసన్‌ 34 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో.. మూడు పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. 19.2 ఓవర్లలో 163 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన పాక్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్‌ ప్రత్యేకం.. ఎందుకంటే!
Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్‌ ఆలింగనం.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు