Pak Vs Eng 6th T20: పాక్‌ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్‌ విధ్వంసం.. ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ చిత్తు

1 Oct, 2022 09:01 IST|Sakshi

England tour of Pakistan, 2022 - Pakistan vs England, 6th T20I: పాకిస్తాన్‌- ఇంగ్లండ్‌.. టీ20 సిరీస్‌ ఆధిపత్యం కోసం నువ్వా- నేనా అన్న రీతిలో పోటీపడుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ విజయంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేయగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది.

తగ్గేదేలే అన్నట్లు మరుసటి మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ బృందం 63 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సత్తా చాటింది. అయితే, నాలుగో టీ20లో మాత్రం మొయిన్‌ అలీ బృందాన్ని దురదృష్ట వెంటాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాక్‌ 3 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఐదో మ్యాచ్‌లోనూ పాక్‌ ఇదే తరహాలో 6 పరుగుల తేడాతో గెలుపొంది 3-2తో ఆధిక్యంలో నిలిచింది.

ఇక లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. ఆతిథ్య జట్టు ఆధిపత్యానికి గండి కొడుతూ సిరీస్‌ను 3-3తో సమం చేసింది. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మొయిన్‌ అలీ బృందానికి ఈ విజయం సాధ్యమైంది.

సాల్ట్‌ విధ్వంసం.. పాక్‌ బ్యాటర్లకు చుక్కలే!
పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించిన సాల్ట్‌.. 41 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

సాల్ట్‌తో పాటు మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌(12 బంతుల్లో 27 పరుగులు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలన్‌(18 బంతుల్లో 26 పరుగులు), నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్‌ డకెట్‌(16 బంతుల్లో 26 పరుగులు- నాటౌట్‌) అద్భుతంగా రాణించడంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జయకేతనం ఎగురవేసింది.

దీంతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(59 బంతుల్లో 87 పరుగులు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఏడో టీ20 ఇరు జట్లకు కీలకంగా మారింది.

పాకిస్తాన్ వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఆరో టీ20 మ్యాచ్‌ స్కోరు:
పాకిస్తాన్‌- 169/6 (20 ఓవర్లలో)
ఇంగ్లండ్‌- 170/2 (14.3 ఓవర్లలో)

చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌!

మరిన్ని వార్తలు