Babar Azam: నేను వాళ్లను పట్టించుకోను.. మనపై మనకు నమ్మకం ఉంటే: బాబర్‌ ఆజం

20 Sep, 2022 14:49 IST|Sakshi

Pakistan vs England T20 Series- Babar Azam- T20 World Cup 2022: ఆసియా కప్‌- 2022 టీ20 టోర్నీలో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం. ఈ మెగా ఈవెంట్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ చేసిన మొత్తం పరుగులు 68 మాత్రమే! ఇక ఫైనల్లోనూ శ్రీలంక చేతిలో పాక్‌ ఓటమి కారణంగా బాబర్‌ కెప్టెన్సీ వైఫల్యాలను ఎత్తి చూపారు ఆ జట్టు మాజీ క్రికెటర్లు.

బ్యాటర్‌గానూ.. సారథిగానూ విఫలమైన తీరును ప్రస్తావిస్తూ షోయబ్‌ అక్తర్‌, డానిష్‌ కనేరియా వంటి ఆటగాళ్లు బాబర్‌ను విమర్శించారు. బాబర్ ఆజం ఫామ్‌లేమి ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో జట్టు భారీ మూల్యం చెల్లించకతప్పదని పేర్కొంటున్నారు.

అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు.. కానీ
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన బాబర్‌ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. మాజీలు తమ అభిప్రాయాలు పంచుకోవడంలో తప్పులేదని.. అయితే వ్యక్తిగతంగా తనను టార్గెట్‌ చేయడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లపై ఎంతటి ఒత్తిడి ఉంటుందో.. ఎలాంటి బాధ్యతలు ఉంటాయో వారికి తెలుసు. వారి కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఉంటారు. వాళ్ల అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు. కానీ.. వ్యక్తిగతంగా నన్ను విమర్శించడం సరికాదు.

నేను వాళ్లను పట్టించుకోను
అయినా.. వాళ్లు ఇచ్చే స్టేట్‌మెంట్లను నేను పట్టించుకోను. వాళ్ల మాటలతో నాకేమీ ఫరక్‌ పడదు. వ్యక్తిగతంగా నాకు ఈ సిరీస్‌ అత్యంత ముఖ్యమైనది. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. 

మన గురించి మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని పట్టించుకోనవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ముందు పాకిస్తాన్‌ స్వదేశంలో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందులో భాగంగా కరాచీ వేదికగా మంగళవారం మొదటి మ్యాచ్‌ ఆరంభం కానుంది.

చదవండి: IND Vs AUS T20 Series: టీమిండియాకు ఆరో బౌలర్ దొరికేశాడు.. ఎవరంటే?!
CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్‌గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్‌ కోసం భారీ ధర!

మరిన్ని వార్తలు