Joe Root: బంతిని ఇలా కూడా షైన్‌ చేస్తారా? నెట్టింట వైరల్‌గా రూట్‌ చర్య! వర్కౌట్‌ అయింది!

3 Dec, 2022 13:28 IST|Sakshi
జాక్‌ లీచ్‌తో జో రూట్‌ (PC: Twitter/ PCB)

England tour of Pakistan, 2022 - Pakistan vs England, 1st Test: పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘బాల్‌ను ఇలా కూడా షైన్‌ చేయొచ్చా రూట్‌?’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

సెంచరీల మోత
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గురువారం ఆరంభమైంది. ఇందుకు వేదికైన రావల్పిండి పిచ్‌ పూర్తిగా నిర్జీవంగా ఉండటంతో ఇంగ్లిష్‌ బ్యాటర్లు సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు జాక్‌ క్రాలే(122), బెన్‌ డకెట్‌(107), ఓలీ పోప్‌(108), హ్యారీ బ్రూక్‌(153) పాక్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు.

ఈ క్రమంలో 657 పరుగులకు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగియగా.. శుక్రవారం పాక్‌ తమ ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో శనివారం లంచ్‌ బ్రేక్‌ సమయానికి 83 ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. 

ఇదిలా ఉంటే.. పాక్‌ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (114), ఇమామ్‌ ఉల్‌ హక్‌(121) సైతం సెంచరీలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జో రూట్‌ బంతిని షైన్‌ చేసిన విధానం ఆసక్తికరంగా మారింది.

బట్టతలపై అలా బంతిని
పాక్‌ ఇన్నింగ్స్‌ 72వ ఓవరల్లో తమ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ను దగ్గరికి పిలిచిన రూట్‌.. అతడి బట్టతలపై చెమటను ఉపయోగించి బాల్‌ను షైన్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఇక ఆ మరుసటి ఓవర్లో రాబిన్సన్‌ బౌలింగ్‌లో పాక్‌ కేవలం రెండే పరుగులు రాబట్టడం విశేషం. కాగా కోవిడ్‌ నేపథ్యంలో బంతిపై సెలైవా(లాలా జలాన్ని) రుద్దడాన్ని నిషేధిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీని కారణంగా బంతిని షైన్‌ చేసే వీల్లేకుండా పోయింది. బౌలర్‌ స్వింగ్‌ను రాబట్టలేడు. దీంతో బ్యాటర్‌ పని సులువు అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూట్‌ బంతిని రుద్దడానికి ఈ పద్ధతిని ఎంచుకోవడం విశేషం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇలా కూడా చేయొచ్చా? 
దీనిపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఆరు సెంచరీలు. దీన్ని బట్టి పిచ్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, రూట్‌ బ్యాటర్‌గా విఫలమైనా.. బంతిని షైన్‌ చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. బట్టతలపై బంతిని షేన్‌ చేయడం.. బాగుంది.. మరుసటి ఓవర్లో 2 పరుగులు.. అంటే పాచిక పారినట్లేనా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ 23 పరుగులు చేశాడు.

చదవండి: IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్‌ బౌలర్‌.. బీసీసీఐ ప్రకటన
IND-W vs AUS-W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియాలో ఆదోని అమ్మాయి

మరిన్ని వార్తలు