Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌! ‘ఆర్నెళ్ల పాటు..!’

14 Nov, 2022 16:39 IST|Sakshi

Pakistan vs England - Pakistan vs New Zealand: టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. 

ఈ విషయం గురించి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సొహైల్‌ సలీమ్‌ మాట్లాడుతూ.. ‘‘కేవలం మోకాలి గాయం మాత్రమే అయితే అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు నెలల కాలం సరిపోతుంది. ఇదే కాకుండా గతంలో అయిన గాయాలు మళ్లీ తిరగబెడితే మాత్రం సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు విశ్రాంతి అవసరం. సర్జరీ చేయాల్సి ఉంటుంది.

ఏదేమైనా ఆఫ్రిది గతంలో గాయపడ్డ సమయంలో చికిత్స అందించే క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అన్న అంశంపై పీసీబీ విచారణ చేయాల్సి ఉంది’’ అని స్థానిక మీడియా డాన్‌తో పేర్కొన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఆఫ్రిది గనుక దూరమైతే.. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో అతడి స్థానంలో హారీస్‌ రవూఫ్‌ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. డిసెంబరు 1 నుంచి 21 వరకు పాకిస్తాన్‌ వేదికగా ఇంగ్లండ్‌ ఆతిథ్య జట్టుతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఆ తర్వాత పాక్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది.

అంచనాలు తలకిందులు
మెల్‌బోర్న్‌లో జరిగిన ఆదివారం నాటి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లో హ్యారీ బ్రూక్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఆఫ్రిది మోకాలికి గాయమైంది. ఈ క్రమంలో చికిత్స అనంతరం 16వ ఓవర్‌ వేసేందుకు అతడు మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో ఇంగ్లండ్‌ 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఒక బంతి వేయగానే ఆఫ్రిది బౌలింగ్‌ నుంచి తప్పుకున్నాడు. 

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను, స్వల్ప లక్ష్యాన్ని చూస్తే ఆఫ్రిది మిగతా 11 బంతులు వేసినా పెద్దగా ఫలితం ఉండేదో లేదో చెప్పలేం కానీ... అతని తొలి 2 ఓవర్ల బౌలింగ్‌ చూస్తే మాత్రం పాక్‌ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుందనేది వాస్తవం. 

ఇక వరల్డ్‌ కప్‌ తొలి 2 మ్యాచ్‌లలో సగం ఫిట్‌నెస్‌తోనే ఇబ్బందిగా ఆడిన షాహిన్, తర్వాతి 4 మ్యాచ్‌లలో పూర్తి ఫిట్‌గా మారి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో అంచనాలు తలకిందులయ్యాయి. ఇక ఇప్పుడు ఈ కీలక పేసర్‌ మరికొంత కాలం జట్టుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

చదవండి: IND vs NZ: టీ20, వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా
T20I Team Rankings: వరల్డ్‌కప్‌ గెలవకపోయినా, టీమిండియానే నంబర్‌ 1

మరిన్ని వార్తలు