Asia Cup 2023: జనాలు లేక బోసిపోయిన పాక్‌ స్టేడియం.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్‌

30 Aug, 2023 17:41 IST|Sakshi

ఆసియా కప్‌-2023 ఆరంభ మ్యాచ్‌ ఇవాళ (ఆగస్ట్‌ 30) పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌, నేపాల్‌ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ చూసేందుకు భారీ సంఖ్యలో జనం హాజరవుతారని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అంచనా వేసింది. అయితే వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, షాహీన్‌ అఫ్రిది లాంటి లోకల్‌ స్టార్లు ఉన్నా, వారిని చూసేందుకు కూడా జనాలు స్టేడియంకు తరలిరాలేదు. ప్రేక్షకులు లేక స్టేడియం బోసిపోయింది. స్టాండ్స్‌ అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. 30000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో కేవలం వందల సంఖ్యలోనే ప్రేక్షకులు దర్శనమిచ్చారు.

మ్యాచ్‌కు భారీగా జనాలు తరలివస్తారని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పలువురు లోకల్‌ సెలబ్రిటీలతో ఓపెనింగ్‌ సెర్మనీని కూడా నిర్వహించింది. వారిని చూసేందుకు కూడా జనాలు రాలేదు. మెగా ఈవెంట్‌ ఆరంభ వేడుకలకు, స్థానిక జాతీయ జట్టు ఆడుతున్న మ్యాచ్‌ చూసేందుకు జనాలు రాకపోవడంతో టోర్నీ నిర్వహించిన పీసీబీపై క్రికెట్‌ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ దేశ స్టార్ క్రికెటర్లు మ్యాచ్‌ ఆడుతున్నా జనాలను స్టేడియంకు రప్పించలేకపోయారని ఛీకొడుతున్నారు.

జింబాబ్వే లాంటి చిన్న దేశంలో వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ జరిగితే స్టేడియాలకు ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆసియా కప్‌-2023 పాకిస్తాన్‌ లెగ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అని సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.  

ఇదిలా ఉంటే, నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పసికూనతో మ్యాచ్‌ కావడంతో పాక్‌ బ్యాటర్లు చించేస్తారని ఆ దేశ అభిమానులు ఊహించుకున్నారు. అయితే పరిస్థితి తారుమారైంది. పాక్‌ 25 పరుగులకే తమ ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. ఫకర్‌ జమాన్‌ 14 పరుగులు చేసి కరణ్‌ బౌలింగ్‌లో ఔట్‌ కాగా.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 5 పరుగులు చేసి రనౌటయ్యాడు. 

కొంత సేపు బాబర్‌ ఆజమ్‌ సాయంతో మహ్మద్‌ రిజ్వాన్‌ ప్రతిఘటించినా, 44 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అతనూ రనౌటయ్యాడు. 5 పరుగులు చేసి అఘా సల్మాన్‌ లామిచ్చేన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 35 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 180/4గా ఉంది. బాబర్‌ ఆజమ్‌ 81, ఇఫ్తికార్‌ అహ్మద్‌ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు