PAK Vs NZ: ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి పాక్‌- కివీస్‌ మ్యాచ్‌ ఏమైందంటే?

6 Jan, 2023 21:07 IST|Sakshi

కరాచీ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా 0-0తో డ్రాగానే ముగిసింది. ఇక ఆఖరి రోజు ఆటలో పాక్‌ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. అదే విధంగా న్యూజిలాండ్‌ గెలుపుకు ఒక్క వికెట్‌ దూరంలో ఉన్న సమయంలో వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్‌లు నిలిపివేశారు.

దీంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకున్నాయి. కాగా 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 9 వికెట్లు ‍304 పరుగులు సాధించింది. అయితే పాక్‌ మాజీ కెప్టెన్‌ స‌ర్ఫరాజ్ అహ్మద్ అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో స‌ర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో స‌ర్ఫరాజ్ 78 పరుగులతో రాణించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్తాన్‌ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్‌ అదనంగా మరో 277 పరుగులు చేసి పాకిస్తాన్‌ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన స‌ర్ఫరాజ్ అహ్మద్‌కు అవార్డు లభించింది. అదే విధంగా ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ కూడా స‌ర్ఫరాజ్‌నే వరించింది.
చదవండిIND vs SL: కెప్టెన్‌గా తొలి ఓటమి.. హార్దిక్‌ పాండ్యాపై గంభీర్‌ కీలక వాఖ్యలు

మరిన్ని వార్తలు