Sarfaraz Ahmed: నీ కెరీర్‌ ముగిసిపోయిందన్నాడు! రమీజ్‌ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్‌!

7 Jan, 2023 11:42 IST|Sakshi

Pakistan vs New Zealand, 2nd Test: ‘‘షాహిద్‌ భాయ్‌ చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే నన్ను పిలిచి.. నువ్వు ఈ మ్యాచ్‌ ఆడుబోతున్నావు అని చెప్పాడు. ప్రాక్టీసు చేస్తున్న సమయంలో బాబర్‌ ఆజం కూడా ఇదే మాట అన్నాడు. నేను షాహిద్‌ భాయ్‌తో గతంలో ఆడాను.. తనకు నా గురించి తెలుసు’’ అని పాకిస్తాన్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నాడు.

దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేశాడు సర్ఫరాజ్‌. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌గా రమీజ్‌ రాజా స్థానంలో నజీమ్‌ సేతీ నియామకంతో పాటు చీఫ్‌ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ఎంపికైన తర్వాత జరిగిన తొలి సిరీస్‌ ఇది.

నిరూపించుకున్నాడు
ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌పై వేటు వేసి 35 ఏళ్ల సర్ఫరాజ్‌కు ఆడే అవకాశం ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సర్ఫరాజ్‌ మాత్రం తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.

మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు (86, 53) బాదిన ఈ వికెట్‌ కీపర్‌.. రెండో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో(78, 118) మెరిశాడు. ఈ రెండు మ్యాచ్‌లలో పాక్‌ను గట్టెక్కించి ఓటమి నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఈ నేపథ్యంలో రమీజ్‌ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్‌కు ప్రశ్న ఎదురైంది. కివీస్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో.. ‘‘ఆటగాడిగా నీ కెరీర్‌ ముగిసిపోయిందని రమీజ్‌ రాజా అన్నాడు. అయితే, వచ్చీ రాగానే.. డేరింగ్‌ సెలక్టర్‌ షాహిద్‌ ఆఫ్రిది నీకు ఛాన్స్‌ ఇచ్చాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సర్ఫరాజ్‌’’ అని విలేకరులు ప్రశ్నించారు.

ఇందుకు బదులుగా.. రమీజ్‌ రాజా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘దేశవాళీ క్రికెట్‌లో రాణించాను. సరైన వ్యక్తుల మార్గదర్శనం, మీడియా ప్రోత్సాహం.. నా కుటుంబం, శ్రేయోభిలాషుల మద్దతుతో ఇక్కడి దాకా వచ్చాను’’ అని సర్ఫరాజ్‌ అహ్మద్‌ చెప్పుకొచ్చాడు. రమీజ్‌ రాజా తన గురించి మాట్లాడిన మాటలకు ఆటతోనే సమాధానం చెప్పానని పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చాడు. షాహిద్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు.

ఆఖరి వరకు ఉత్కంఠ
పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు ఉత్కంఠభరిత మలుపులు తిరిగి చివరకు ‘డ్రా’గా ముగిసింది. ఒక దశలో పాక్‌ ఓటమి ఖాయమనిపించి, ఆపై గెలుపు అవకాశం చిక్కినా వాడుకోలేకపోగా... పేలవ బౌలింగ్‌తో చివరకు కివీస్‌ ‘డ్రా’తో సంతృప్తి పడాల్సి వచ్చింది. 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 0/2తో ఆట కొనసాగించిన పాక్‌ శుక్రవారం మ్యాచ్‌  ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

సర్ఫరాజ్‌ అహ్మద్‌ (176 బంతుల్లో 118; 9 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత సెంచరీ సాధించగా...షాన్‌ మసూద్‌ (35), సౌద్‌ షకీల్‌ (32), ఆగా సల్మాన్‌ (30) అండగా నిలిచారు. ఒక దశలో 80 పరుగుల వద్దే పాక్‌ 5 వికెట్లు కోల్పోయింది. అయితే సర్ఫరాజ్, షకీల్‌ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. సల్మాన్‌తో కూడా సర్ఫరాజ్‌ వేగంగా 70 పరుగులు జత చేశాడు.

చివరి 15 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సి ఉండగా... తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ విజయంపై గురి పెట్టింది. అయితే 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సర్ఫరాజ్‌ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వికెట్‌ తీస్తే కివీస్‌ గెలుపు అందుకునే అవకాశం ఉండగా...చివరి జోడి నసీమ్‌ షా (15 నాటౌట్‌), అబ్రార్‌ (7 నాటౌట్‌) వికెట్‌ పడకుండా 21 బంతులు జాగ్రత్తగా ఆడారు. మిగిలిన 3 ఓవర్లలో పాక్‌కు 15 పరుగులు అవసరం కాగా... వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో రెండు టెస్టుల సిరీస్‌ 0–0తో డ్రాగా ముగిసింది.

చదవండి: ఆసీస్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం.. డబుల్‌ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్‌ డిక్లేర్
Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్‌ ఎంట్రీ!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు