Pak Vs NZ 2nd Test: గతేడాది.. మళ్లీ ఇప్పుడు! ఇదో సంప్రదాయంగా పెట్టుకున్నాడే! కాన్వే అరుదైన ఫీట్‌

2 Jan, 2023 17:28 IST|Sakshi

Pakistan vs New Zealand, 2nd Test- Devon Conway: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే శతకం సాధించాడు. 191 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 122 పరుగులు చేశాడు. కాగా కరాచీ వేదికగా సోమవారం(జనవరి 2) ఆరంభమైన రెండో టెస్టులో టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో మొదటి రోజు ఆటలో భాగంగా 51.1 ఓవర్లో మీర్‌ హంజా బౌలింగ్‌లో పరుగులు తీసిన కాన్వే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికి నాలుగో శతకం కావడం గమనార్హం. అంతేకాకుండా.. ఈ ఇన్నింగ్స్‌లో మరో అరుదైన ఫీట్‌ కూడా నమోదు చేశాడు కాన్వే.

గతేడాది బంగ్లాదేశ్‌తో టెస్టులో భాగంగా  జనవరి 1న సెంచరీ చేసిన కాన్వే.. ఈ ఏడాది కూడా అదే తరహాలో శతకంతో కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

గత మ్యాచ్‌లో సెంచరీకి 8 పరుగుల దూరంలో నిలిచిపోయిన అతడు.. ఈసారి 100 పరుగుల మార్కు అందుకోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కాన్వేను గట్టిగా ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. వరుసగా జనవరి 1, 2022- జనవరి 2, 2023లో సెంచరీ బాదడాన్ని ప్రస్తావిస్తూ అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాది మూడో తారీఖున శతకం బాదుతాడేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

కాగా ఐపీఎల్‌లో కాన్వేచెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘కొత్త ఏడాది.. న్యూజిలాండ్‌కు కొత్త 100.. గతేడాది నుంచి కాన్వే ఇదో సంప్రదాయంలా పాటిస్తున్నాడు’’ అని కొనియాడింది. 
చదవండి: BBL: సంచలన క్యాచ్‌.. బిక్క ముఖం వేసిన బ్యాటర్‌! ఇంతకీ అది సిక్సరా? అవుటా?

మరిన్ని వార్తలు