-

Pak Vs WI 2022 1st ODI: విండీస్‌కు షాక్‌.. పాక్‌ చేతిలో తప్పని ఓటమి

9 Jun, 2022 09:06 IST|Sakshi

West Indies tour of Pakistan, 2021-22: 1st ODI- నెదర్లాండ్స్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన వెస్టిండీస్‌కు ఓటమి ఆహ్వానం పలికింది. మొదటి వన్డేలో పాకిస్తాన్‌ చేతిలో విండీస్‌ పరాజయం పాలైంది. నికోలస్‌ పూరన్‌ బృందంపై 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ వన్డే సిరీస్‌ ఆడేందుకు విండీస్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బుధవారం(జూన్‌ 8) ముల్తాన్‌ వేదికగా పాక్‌- విండీస్‌ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్‌ షాయీ హోప్‌ 127 పరుగులతో విండీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్రూక్స్‌ సైతం 70 పరుగులతో రాణించాడు. 

అయితే, నెదర్లాండ్స్‌ పర్యటనలో తీవ్రంగా నిరాశ పరిచిన కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 21 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. రోవ్‌మన్‌ పావెల్‌ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

ఇక విండీస్‌ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌(11 పరుగులు) వికెట్‌ కోల్పోయినా.. మరో ఓపెనర్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌(65) బ్యాట్‌ ఝులిపించడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 103 పరుగుల భారీ స్కోరుతో పాక్‌ విజయానికి బాటలు వేశాడు.

మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అర్ధ శతకం(59పరుగులు) ఆకట్టుకోగా.. ఖుష్‌ దిల్‌ షా 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ మొదటి వన్డే:
♦టాస్‌- వెస్టిండీస్‌- బ్యాటింగ్‌
♦వెస్టిండీస్‌ స్కోరు: 305/8 (50)
♦పాకిస్తాన్‌ స్కోరు: 306/5 (49.2)
♦విజేత: పాకిస్తాన్‌.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్‌పై విజయం

మరిన్ని వార్తలు