Babar Azam: విండీస్‌తో మ్యాచ్‌ పాకిస్తాన్‌ కెప్టెన్‌ ‘ఇల్లీగల్‌ ఫీల్డింగ్‌’.. అందుకు మూల్యంగా..

11 Jun, 2022 16:45 IST|Sakshi
విండీస్‌తో రెండో వన్డేలో పాక్‌ విజయం(PC: PCB Twitter)

Pakistan Vs West Indies: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం చర్య కారణంగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు లభించాయి. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తన అనుచిత ప్రవర్తనతో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ దృష్టిలో పడ్డాడు బాబర్‌. దీంతో పాక్‌ జట్టు ఈ మేరకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ ఏకపక్ష విజయం నమోదు చేయడంతో ఈ విషయం పెద్దగా ప్రభావం చూపలేదు.

అసలేం జరిగిందంటే.. రీషెడ్యూల్డ్‌ వన్డే సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌ వేదికగా పాక్‌ జట్టు వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో తలపడింది. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌, కెప్టెన్‌ బాబర్‌ ఆజం చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్యాటక విండీస్ కైల్‌ మేయర్స్‌(33 పరుగులు), బ్రూక్స్‌(42 పరుగులు), కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌(25) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 120 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

అయితే, వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 29వ ఓవర్‌లో బాబర్‌ వికెట్‌ కీపింగ్‌ గ్లోవ్‌ తొడుక్కుని ఫీల్డింగ్‌ చేశాడు. కాగా క్రికెట్‌ చట్టాల్లోని 28.1(ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) నిబంధన ప్రకారం.. ఫీల్డింగ్‌ సమయంలో వికెట్‌ కీపర్‌ తప్ప మరే ఇతర ఫీల్డర్‌ గ్లోవ్స్‌ తొడుక్కోవడానికి వీల్లేదు. లెగ్‌ గార్డ్స్‌ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఫీల్డర్‌ వేళ్లకు గాయమైతే అంపైర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే గ్లోవ్స్‌ ధరించవచ్చు.

ఈ నేపథ్యంలో తన పర్మిషన్‌ లేకుండా గ్లోవ్‌తో ఫీల్డింగ్‌ చేసిన బాబర్‌కు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ శిక్ష విధించాడు. వెస్టిండీస్‌కు ఐదు పరుగులు యాడ్‌ చేశాడు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘రికార్డులు సాధిస్తే సరిపోదు.. కాస్త క్రమశిక్షణ కూడా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇలాగే ఉంటుంది’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా ఈ మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన బాబర్‌.. మూడు ఫార్మాట్‌లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్‌ స్కోర్‌లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.  ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో విజయంతో పాక్‌ 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 12న జరుగనుంది. 

పాకిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే స్కోర్లు
పాకిస్తాన్‌: 275/8
వెస్టిండీస్‌: 155/10
ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు