Nicholas Pooran: ఐపీఎల్‌లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్‌! కానీ పాక్‌తో మ్యాచ్‌లో..

8 Jun, 2022 13:47 IST|Sakshi

Pakistan Vs West Indies 2022- ODI Series: నెదర్లాండ్స్‌ జట్టును క్లీన్‌స్వీప్‌ చేసి కెప్టెన్‌గా ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించాడు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల సారథి నికోలస్‌ పూరన్‌. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌ పర్యటనలో ఆ జట్టును 3-0 తేడాతో మట్టికరిపించి శుభారంభం అందుకున్నాడు. కెప్టెన్‌గా సఫలమైనా బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 

నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో మూడు వన్డేల్లో పూరన్‌ సాధించిన స్కోర్లు వరుసగా.. 7,10,7. ఇక మూడుసార్లూ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్‌తో సిరీస్‌ ముగియగానే విండీస్‌ జట్టు పాకిస్తాన్‌కు పయమనమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. జూన్‌ 8న ముల్తాన్‌ వేదికగా ఆతిథ్య పాక్‌ జుట్టతో తలపడనుంది.

నాకు ఇదేం కొత్త కాదు!
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పూరన్‌.. తన ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదన్నాడు. ‘‘నేను బాగానే ఉన్నా! ఇలా పరుగులు చేయకపోవడం నాకేం కొత్త కాదు. ఒక్కసారి నా కెరీర్‌ గణాంకాలు చెక్‌ చేసుకోవాలి. ప్రతిసారి పరుగులు సాధిస్తూనే ఉన్నాను. కానీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. నెదర్లాండ్స్‌లో నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల నిరాశ చెందాను.

ఆ సిరీస్‌లో నేను రన్స్‌ స్కోర్‌ చేసి ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. నిజానికి నేను స్పిన్‌ బాగా ఆడగల బ్యాటర్‌ను. నెదర్లాండ్స్‌లో వైఫల్యం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాలం కలిసి రావాలి అంతే! కచ్చితంగా నేను రాణిస్తాను’’ అంటూ నికోలస్‌ పూరన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇక పాకిస్తాన్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయన్న పూరన్‌.. అదేమీ తమకు పెద్ద సమస్య కాకపోవచ్చని.. కచ్చితంగా మెరుగ్గా ఆడతామని పేర్కొన్నాడు. కాగా ముల్తాన్‌ వేదికగా పాక్‌, విండీస్‌ జట్ల మధ్య సిరీస్‌ జరుగనుంది. ఇ​క ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన పూరన్‌.. 13 ఇన్నింగ్స్‌లో కలిపి 306 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు