Pak Vs Zim: పాక్‌ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్‌ బీన్‌ గోలేంటి?

28 Oct, 2022 13:09 IST|Sakshi
(Courtesy: Twitter/Ngugi Chasura)

T20 WC 2022- Pakistan vs Zimbabwe- Who is the fake Pak Mr Bean: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు జింబాబ్వే జట్టును హీరోను చేస్తే.. పాకిస్తాన్‌ను జీరో చేసింది. బాబర్‌ ఆజం బృందానికి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ప్రపంచకప్‌-2022లో భాగంగా సూపర్‌-12లో ఒక్క పరుగు తేడాతో పాక్‌ను ఓడించి జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా బ్యాటర్‌గా విఫలమైనా(9 పరుగులు) బౌలింగ్‌తో మ్యాజిక్‌ చేసి తమ జట్టును గెలిపించాడు.

పాక్‌ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించి
పెర్త్‌ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్‌ చేసిన ఈ రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌.. కీలక సమయంలో వికెట్లు తీశాడు. మొత్తంగా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌ గడ్డ మీద పుట్టిన ఈ ఆల్‌రౌండర్‌.. పాక్‌తో పోరులో జింబాబ్వేను గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే చేతిలో ఓటమితో పాకిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సెమీస్‌ అవకాశాలపై ఈ పరాజయం కచ్చితంగా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

నాడు పాక్‌ మోసం చేసిందంటూ జింబాబ్వే ప్రెసిడెంట్‌ ట్వీట్‌!
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌-2022 సూపర్‌​-12లో జింబాబ్వే తొలి విజయంతో ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్‌ డేంబజో మినాంగాగ్వ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘జింబాబ్వే అద్భుత విజయం! జట్టుకు శుభాకాంక్షలు. నెక్ట్స్ టైమ్‌ నిజమైన మిస్టర్‌ బీన్‌ను పంపండి’’ అని పేర్కొన్నారు. తమ జట్టును అభినందిస్తూనే పాక్‌ తీరుపై సెటైర్లు వేశారు. గతంలో తమ ప్రజలను మోసం చేసే విధంగా పాక్‌ వ్యవహరించిందన్న అర్థం వచ్చేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసలేం జరిగిందంటే..
నూరుద్దియన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు పాక్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు షేర్‌ చేస్తూ.. ప్రతీకార మ్యాచ్‌ అవుతుందనుకోవడం లేదంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు స్పందనగా.. నుగుగి చాసురా అనే నెటిజన్‌.. ‘‘జింబాబ్వే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మిస్టర్‌బీన్‌ రోవాన్‌ బదులు పాక్‌ నకిలీ బీన్‌ను మా దగ్గరికి పంపించారు.

ఈ మ్యాటర్‌ను రేపటి​ మ్యాచ్‌లో తేలుస్తాం. వర్షం మిమ్మల్ని కాపాడాలని ప్రార్థించుకోండి’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇందుకు జతగా మిస్టర్‌ బీన్‌ డూప్‌తో ఇద్దరు వ్యక్తులు ఫొటోలకు పోజులిస్తున్న దృశ్యాన్ని షేర్‌ చేశాడు.

అసలేం జరిగిందంటూ ఓ పాకిస్తానీ ఫ్యాన్‌ అడుగగా.. సదరు నెటిజన్‌.. ‘‘వాళ్లు మాకు మిస్టర్‌ బీన్‌ బదులు నకిలీ మిస్టర్‌ బీన్‌ ఇచ్చారు. స్థానికంగా జరిగే అగ్రికల్చరల్‌ షోకు అతడిని పంపించారు’’ అని వివరణ ఇచ్చాడు. ‘‘ఈ పాక్‌ బీన్‌.. ప్రజలను మోసం చేస్తూ వారి డబ్బును దోచుకుంటాడు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు.

సోషల్‌ మీడియాలో వైరల్‌
దీంతో ఈ నకిలీ బీన్‌ వ్యవహారమేమిటంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో పాక్‌పై జింబాబ్వే గెలుపొందడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. మిస్టర్‌ బీన్‌ డూప్‌లా ఉన్న ఆ వ్యక్తి పేరు ఆసిఫ్‌ ముహ్మద్‌గా కొంతమంది పేర్కొన్నారు. అతడు పాకిస్తానీ కమెడియన్‌. ఒకానొక సందర్భంలో అతడు జింబాబ్వే షోలో పాల్గొన్నట్లు సోషల్‌ మీడియాలో పలు వీడియోలు ట్రెండ్‌ అవుతున్నాయి.

2016లో హరారేలో ఓ కామెడీ షోలో రియల్‌ మిస్టర్‌ బీన్‌ను చూడటానికి 10 డాలర్లు చెల్లించి.. ప్రజలు ఎదురుచూడగా.. ఆసిఫ్‌ రావడంతో వారు కంగుతిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే జింబాబ్వే ప్రెసిడెంట్‌ ఎమర్సన్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఇందుకు పాకిస్తాన్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు.

ఘాటు స్పందన
‘‘మా దగ్గర నిజమైన మిస్టర్‌ బీన్‌ లేకపోవచ్చు. కానీ ఆటలో క్రీడా స్ఫూర్తి కనబరచ గల పరిణతి ఉంది... మా పాకీస్తానీలకు వెంటనే తిరిగి పుంజుకునే సరదా కూడా ఉంది! మిస్టర్‌ ప్రెసిడెంట్‌ మీకు శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు మీ జట్టు చాలా బాగా ఆడింది’’ అని ట్వీట్‌ చేశారు. 

మిస్టర్‌ బీన్‌ ఎవరు?
మిస్టర్‌ బీన్‌గా కోట్లాది మందిని అలరిస్తున్న రోవాన్‌ సెబాస్టియన్‌ అట్కిన్సన్‌ ఇంగ్లిష్‌ నటుడు. కమెడియన్‌గా.. రైటర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఆయన ముఖం చూస్తే చాలు నవ్వాపుకోవడం ఎవరితరం కాదు! 

చదవండి: Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్‌ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం..
T 20 WC: 'బాబర్‌ ఒక పనికిరాని కెప్టెన్‌.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'

మరిన్ని వార్తలు