Fakhar Zaman: పసికూనపై పాక్‌ బ్యాటర్ ప్రతాపం‌.. టీమిండియాతో ఆడి చూపించు!

16 Aug, 2022 21:32 IST|Sakshi

పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ పసికూన నెదర్లాండ్స్‌పై శతకంతో రెచ్చిపోయాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం నెదర్లాండ్స్‌తో తొలి వన్డేలో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ 2 పరుగులకే వెనుదిరిగినప్పటికి.. కెప్టెన్‌ బాబర్‌ ఆజం(74)తో కలిసి ఫఖర్‌ జమాన్‌ పాక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో ఏడో శతకం అందుకున్న ఫఖర్‌ జమాన్‌ ఓవరాల్‌గా 109 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. బాబర్‌ ఆజం(85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్సర్‌) అతనికి సహకరించాడు. ఇక చివర్లో షాదాబ్‌ ఖాన్ ‌(28 బంతుల్లో 48 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. 

కాగా నెదర్లాండ్స్‌పై శతకంతో రెచ్చిపోయిన ఫఖర్‌ జమాన్‌ను టీమిండియా ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేశారు. '' పసికూనపై ప్రతాపం చూపించడం కాదు.. ఆసియాకప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో ఆడి చూపించు.. అప్పుడు తెలుస్తుంది నీ అసలు ఆట'' అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్‌ టోర్నీ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్‌లు ఆగస్టు 28న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టి20 ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

ఇక రెండు నెలల​వ్యవధిలోనే టీమిండియా, పాకిస్తాన్‌ రెండుసార్లు ఎదురుపడనున్నాయి. ఒకటి ఆసియా కప్‌ అయితే.. మరొకటి ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 28న మరోసారి ఇరుజట్లు తలపడనున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ తలపడితే ముచ్చటగా మూడోసారి తలపడినట్టువుతుంది. ఇక ఆసియాకప్‌లో భారత్‌, పాక్‌లు 13సార్లు తలపడితే.. ఏడుసార్లు టీమిండియా గెలవగా.. ఐదు మ్యాచ్‌ల్లో పాక్‌ నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా ఆగస్ట్‌ 28న జరుగనున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 15న ప్రారంభించగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్‌- పాక్‌ మ్యాచ్‌ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర

Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్‌

మరిన్ని వార్తలు