చివరి బంతికి గెలిచిన పాక్‌

3 Apr, 2021 05:50 IST|Sakshi

బాబర్‌ ఆజమ్‌ సెంచరీ

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి

డస్సెన్‌ అజేయ శతకం వృథా

సెంచూరియన్‌: చివరి ఓవర్‌ చివరి బంతిదాకా ఉత్కంఠగా జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 274 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో పాకిస్తాన్‌ విజయానికి కేవలం మూడు పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లున్నాయి. ఆఖరి ఓవర్‌ వేసిన దక్షిణాఫ్రికా పేసర్‌ ఫెలుక్వాయో తొలి బంతికి షాదాబ్‌ ఖాన్‌ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్‌)ను అవుట్‌ చేశాడు. తర్వాతి మూడు బంతులకు ఫెలుక్వాయో ఒక్క పరుగూ ఇవ్వలేదు. దాంతో పాక్‌ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. అయితే ఫాహిమ్‌ అష్రఫ్‌ (5 నాటౌట్‌) ఐదో బంతికి రెండు పరుగులు, చివరి బంతికి ఒక పరుగు సాధించి పాకిస్తాన్‌ను గట్టెక్కించాడు.

అంతకుముందు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (104 బంతుల్లో 103; 17 ఫోర్లు) వన్డే కెరీర్‌లో 13వ సెంచరీ సాధించాడు. ఇమామ్‌ ఉల్‌ హక్‌ (80 బంతుల్లో 70; 3 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి ఆజమ్‌ రెండో వికెట్‌కు 177 పరుగులు జోడించాడు. ఆజమ్, ఇమామ్‌ అవుటయ్యాక పాక్‌ కష్టాల్లో పడింది. అయితే రిజ్వాన్‌ (52 బంతుల్లో 40; 4 ఫోర్లు), షాదాబ్‌ ఆటతో పాక్‌ మళ్లీ లక్ష్యం దిశగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు సాధించింది. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికాను డస్సెన్‌ అజేయ శతకం (134 బంతుల్లో 123 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో ఆదుకున్నాడు. అతడు మిల్లర్‌ (50; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌ రెండేసి వికెట్లు తీశారు. రెండో వన్డే జొహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జరుగుతుంది. 

మరిన్ని వార్తలు