ZIM Vs PAK: రెచ్చిపోయిన హసన్‌ అలీ, పాక్‌ ఘనవిజయం

2 May, 2021 08:46 IST|Sakshi

హరారే: మీడియం పేస్‌ బౌలర్‌ హసన్‌ అలీ (5/36) హడలెత్తించడంతో... జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ 116 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌ మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 374/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 133 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్‌ ఆలమ్‌ (140; 20 ఫోర్లు) తన ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరుకు మరో 32 పరుగులు జోడించి చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు.

హసన్‌ అలీ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఫవాద్‌ ఆలమ్‌ ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో తరిసాయ్‌ మసకందా (43; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ ఐదు వికెట్లు, నౌమాన్‌ అలీ రెండు వికెట్లు తీశారు. హసన్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. రెండో టెస్టు ఈనెల 7 నుంచి హరారేలోనే జరుగుతుంది. 

చదవండి: T20 World Cup: వేదిక మారినా హక్కులు మావే!

మరిన్ని వార్తలు