'బాబర్‌ అజమ్‌ నన్ను నమ్మించి మోసం చేశాడు'

29 Nov, 2020 11:11 IST|Sakshi

కరాచీ : పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి : రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే)

'బాబర్, నేను స్కూల్‌ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి  బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక నన్ను కొట్టి.. శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని మహిళ పేర్కొం‍ది. 

అయితే మహిళ చేసిన ఆరోపణలపై బాబార్‌ అజమ్‌ స్పందించలేదు.మహిళ చెప్పినదాంట్లో నిజమెంత అనేది పక్కనబడితే.. బాబర్‌పై చేసిన ఆరోపణలు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాయి. పేరు సంపాదించడానికి ఇలాంటి పనికిరాని ఆరోపణలు చేస్తుందని బాబర్‌ అభిమానులు మండిపడుతున్నారు. మహిళ చేసిన ఆరోపణలపై పాక్‌ క్రికెట్ బోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. (చదవండి : తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్‌)

కాగా కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో వారు ప్రస్తుతం 14 రోజుల ఐసోలేషన్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న కివీస్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు ప్రారంభం కానుంది. అయితే తాజాగా పాక్‌ టీమ్‌లో ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిగతా ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌కే పరిమితం అయ్యారు.

మరిన్ని వార్తలు