Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్‌ కెప్టెన్‌.. ఖాతాలో మరో మైలురాయి

19 Jul, 2022 21:02 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజం వీరోచిత సెంచరీతో మెరిశాడు. తన ఇన్నింగ్స్‌తో జట్టు  తక్కువ స్కోరుకు ఆలౌట్‌ కాకుండా కాపాడి ప్రత్యర్థికి కేవలం 4 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 55 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బాబర్‌ ఆజం ప్రభాత్‌ జయసూర్య అద్భుత బంతికి వెనుదిరిగాడు. 

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం టెస్టుల్లో అరుదైన ఫీట్‌ సాధించాడు. టెస్టుల్లో 3వేల పరుగులు మార్క్‌ను అధిగమించాడు. 41 టెస్టుల్లో బాబర్‌ ఆజం ఈ ఘనత సాధించాడు. కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌లో ఉన్న బాబర్‌ ఒక రకంగా టీమిండియా స్టార్‌ కోహ్లిని తలపిస్తున్నాడు. 2015-16లో కోహ్లి కూడా ఇదే తరహా ఫామ్‌ కనబరిచాడు. ఇక శ్రీలంకతో తొలి టెస్టులో సెంచరీ మార్క్‌ను అందుకోవడం ద్వారా 9వ సెంచరీ అందుకున్నాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో పాక్‌ దిగ్గజం ఇంజమామ్‌ ఉల్‌ హక్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. అయితే ఇంజమామ్‌ 131 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు చేస్తే.. బాబర్‌కు మాత్రం 9 సెంచరీలు సాధించడానికి 70 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి.

మ్యాచ్‌ విషయానికి వస్తే నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌ 112, మహ్మద్‌ రిజ్వాన్‌ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్‌ విజయానికి 120 పరుగులు అవసరం కాగా.. లంకకు ఏడు వికెట్లు అవసరం. మరొక రోజు ఆట మిగిలి ఉండడంతో లంక బౌలర్లు మ్యాజిక్‌ చేస్తారా.. లేక ప్యాక్‌ బ్యాటర్లకు దాసోహం అంటారా అనేది వేచి చూడాలి.

చదవండి: Pak Vs SL 1st Test: ఏమని వర్ణించగలం?.. బాబర్‌ ఆజంకే దిమ్మ తిరిగింది 

యాసిర్‌ షా 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్‌ గుర్తురాక మానడు

మరిన్ని వార్తలు