రమీజ్‌ రజాకు దిమ్మతిరిగిపోయే షాక్‌.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ పదవి నుంచి తొలగింపు

21 Dec, 2022 17:08 IST|Sakshi

Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో 0-3 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన ఎఫెక్ట్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ రమీజ్‌ రజాపై పడింది. ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్‌ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్‌కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్‌ 21) ప్రకటించింది.

రమీజ్‌పై వేటును పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షెరీఫ్‌ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్‌ స్థానం‍లో పీసీబీ నూతన చైర్మన్‌గా నజమ్‌ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్‌ ప్రధానే నామినేట్‌ చేశారని పీసీబీ పేర్కొంది.

కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్‌లో రమీజ్‌ రజా పీసీబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. రమీజ్‌ హయాంలో పాక్‌ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. రమీజ్‌.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్‌పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్‌ చేస్తే.. బోర్డు ఆఫ్‌ గవర్నర్‌లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. 

ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్‌ నజమ్‌ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో విభేదాల కారణంగా నజమ్‌ బోర్డు చైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు. 


 

మరిన్ని వార్తలు