పాక్‌ మాజీ కెప్టెన్‌ భారీ మొత్తం ఆఫర్‌ చేశాడు.. షేన్‌ వార్న్‌ సంచలన వ్యాఖ్యలు

8 Jan, 2022 19:31 IST|Sakshi

Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. 1994 పాక్‌ పర్యటన సందర్భంగా నాటి పాక్‌ కెప్టెన్ సలీం మాలిక్ తనకు లంచం(2, 76,000 అమెరికన్‌ డాలర్లు) ఆఫర్‌ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సామర్ధ్యం మేరకు ఆడకూడదని, తనతో పాటు మరో ఆసీస్‌ ఆటగాడు టిమ్‌ మేకు వార్నింగ్ కూడా ఇచ్చాడని బాంబు పేల్చాడు. త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్న తన డాక్యుమెంటరీ "షేన్‌" కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన ఆరోపణలు చేశాడు.

నాటి పాక్‌ పర్యటనలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సామర్ధ్యం మేరకు బౌలింగ్‌ చేయకూడదని, వికెట్లు తీసే ప్రయత్నం చేయకుండా వైడ్‌ బంతులు విసరాలని తనతో పాటు టిమ్‌ మేకు సలీం మాలిక్‌ ప్రలోభాలతో కూడిన వార్నింగ్‌ ఇచ్చాడని వార్న్‌ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఓటమి అంచుల్లో ఉండిందని, అదే జరిగితే ఆ దేశ ఆటగాళ్ల ఇళ్లపై అభిమానులు దాడి చేస్తారని మాలిక్‌ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని వార్న్‌ తెలిపాడు. 

సదరు విషయాన్ని తాను, మే.. నాటి ఆసీస్‌ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నాడు.  వార్న్‌ చేసిన ఈ వ్యాఖ్యలతో పాక్‌ క్రికెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువు అయిన వార్న్‌ ఆరోపణల్లో ఎంత మేరకు నిజం ఉందో వేచి చూడాలి. కాగా, వార్న్‌.. 2003 ప్రపంచకప్‌కు ముందు డోపింగ్‌ పరీక్షలో పట్టుబడి ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.  
చదవండి: ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్‌ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మరిన్ని వార్తలు