Inzamam ul Haq: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు..

28 Sep, 2021 07:28 IST|Sakshi

Inzamam-ul-Haq undergoes angioplasty: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించి ఆంజియోప్లాస్టి నిర్వహించారు. ప్రస్తుతం ఇంజమామ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అతడు కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జియో న్యూస్‌ జర్నలిస్టు ఆర్ఫా ఫిరోజ్‌ జేక్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. 

కాగా ఇంజీకి గుండెపోటు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో అతడి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ‘‘నువ్వు త‍్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఇక 1992 వరల్డ్‌కప్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టులో సభ్యుడైన ఇంజమామ్‌... దేశంలోని అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. గతంలో పాక్‌ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు.  

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..
1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇంజమామ్‌ ఉల్‌ హక్‌.. తన కెరీర్‌లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్‌ చేశాడు. ఇక పాకిస్తాన్‌ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు. 

చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్‌

మరిన్ని వార్తలు