PAK Vs ENG Final: 1992 సీన్‌ రిపీట్‌ కానుందా.. అయితే పాక్‌దే టైటిల్‌!

10 Nov, 2022 18:52 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీఫైనల్లోనే వెనుదిరగడంతో ఫ్యాన్స్‌ నిరాశకు లోనయ్యారు. సూపర్‌-12 దశలోనే ఇంటికి వెళుతుందనుకున్న పాకిస్తాన్‌ ఆఖర్లో కీలక విజయాలతో కాస్త అదృష్టం కూడా తోడవ్వడంతో సెమీస్‌లో కివీస్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.

అటు ఇంగ్లండ్‌ మాత్రం సూపర్‌-12 దశలో పడుతూ లేస్తూ తమ ప్రయాణం కొనసాగించినప్పటికి అసలైన మ్యాచ్‌లో మాత్రం జూలు విదిల్చింది. సెమీస్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీమిండియాకు చరిత్రలో మరిచిపోలేని పరాజయాన్ని ఇచ్చింది. అలా మొత్తానికి నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌లు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి.

ఫైనల్‌ పోరు జరగకముందే రంగంలోకి దిగిన క్రీడా పండితులు అప్పుడే విజేత ఎవరనేది అంచనా వేస్తున్నారు. చాలా మంది క్రీడా పండితులు.. 1992 వన్డే వరల్డ్‌కప్‌ సీన్‌ రిపీట్‌ కానుందంటూ జోస్యం చెబుతున్నారు. కొందరు మాత్రం అంత సీన్‌ లేదని.. ఫైనల్‌ వన్‌సైడ్‌ జరగడం ఖాయమని.. ఇంగ్లండ్‌ పెద్ద విజయంతోనే టైటిల్‌ గెలవబోతుందని పేర్కొన్నారు.

ఈ సంగతి పక్కనబెడితే ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆటతీరు చూస్తే యాదృశ్చికమో లేక అలా జరిగిందో తెలియదు కానీ అచ్చం 1992 వన్డే వరల్డ్‌కప్‌ను తలపిస్తుంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్తాన్‌ను నడిపించాడు. ఆ వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలో టీమిండియాతో ఓడిపోవడం.. ఆ తర్వాత ఇంటిబాట పట్టాల్సిన పాక్‌ అదృష్టానికి తోడుగా ఆఖరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు రావడం.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తోనే సెమీస్‌ ఆడి ఫైనల్‌కు ఎంటరవ్వడం.. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఇమ్రాన్‌ నాయకత్వంలోని పాక్‌ జట్టు జగజ్జేతగా నిలవడం జరిగిపోయింది.

తాజా వరల్డ్‌కప్‌లోనూ బాబర్‌ సేనకు 1992 పరిస్థితులే కనిపించాయి. సూపర్‌-12 దశలో టీమిండియా చేతిలో ఓడడం.. ఆపై ఇంటిబాట పట్టాల్సిన పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికాలపై విజయాలు సాధించడం.. అదే సమయంలో ప్రొటిస్‌ నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిపోవడం పాక్‌కు అదృష్టంగా మారింది. ఈ దెబ్బతో సెమీస్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ అక్కడ న్యూజిలాండ్‌ను చావుదెబ్బ కొట్టి ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

1992 వన్డే వరల్డ్‌కప్‌, 2022 టి20 వరల్డ్‌కప్‌లో పాక్‌ ఆట సాగిన విధానం..

1992 వన్డే వరల్డ్‌కప్‌: అప్పటి వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియానే ఆతిథ్యం
2022 టి20 వరల్డ్‌కప్: ఇప్పుడు కూడా ఆస్ట్రేలియానే ఆతిథ్యం

1992: మెల్‌బోర్న్‌ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి
2022:  అదే మెల్‌బోర్న్‌లో టీమిండియా చేతిలోనే ఓటమి

1992: ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు
2022: నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు

1992: లీగ్‌ దశలో చివరి రోజు ఒక్క పాయింట్‌ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్‌ సెమీస్‌కు అర్హత
2022: తాజాగా సూపర్‌-12 దశలో నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడడం.. బంగ్లాదేశ్‌పై పాక్‌ గెలవడం.. దీంతో ఒక్క పాయింట్‌ ఆధిక్యంతో సెమీస్‌కు అర్హత

1992: సెమీస్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు
2022: సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన పాక్‌ ఫైనల్‌కు

1992: ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన పాకిస్తాన్‌
2022: ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనున్న పాక్‌

అయితే జరుగుతున్నది టి20 ప్రపంచకప్‌ కాబట్టి ఈ అంచనాలు నిజమవుతాయని చెప్పలేం. ఎందుకంటే పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కానీ అనాలసిస్‌ చూస్తే మాత్రం పాక్‌ టైటిల్‌ కొట్టనుందా అనే అనుమానం కలగక మానదు. కానీ ఇప్పుడున్న ఫామ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం పాక్‌కు పెద్ద సవాల్‌. మరి ఆ సవాల్‌ను జయించి పాక్‌ విశ్వవిజేతగా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే నవంబర్‌ 13 వరకు ఆగాల్సిందే.

చదవండి: IND Vs ENG: మాట నిలబెట్టుకున్న జాస్‌ బట్లర్‌

రోహిత్‌ శర్మపై ఫ్యాన్స్‌ ఫైర్‌.. ఐపీఎల్‌ కెప్టెన్‌ అంటూ..


మరిన్ని వార్తలు