Naseem Shah: అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు

18 Nov, 2022 15:53 IST|Sakshi

చిరకాల ప్రత్యర్థి.. దాయాది పాకిస్తాన్‌ జట్టులో బౌలింగ్‌ విభాగం ఎంత పటిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లయినప్పటికి అలాంటి నిఖార్సైన పేసర్లు మనకూ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టులో పేసర్లకు కొదువ లేదు. ఒకరు గాయపడితే మరొక ఫాస్ట్‌ బౌలర్‌ సిద్ధంగా ఉంటున్నాడు. అది చురకత్తులాంటి బంతులతో వికెట్లు తీసే బౌలర్లు తయారవుతున్నారు. ఇటీవలే టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఫైనల్‌ వరకు వచ్చిందంటే అందులో బౌలర్ల పాత్రే ఎక్కువగా ఉంది.

షాహిన్‌ అఫ్రిది, నసీమ్‌ షా, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌, హారిస్‌ రౌప్‌ ఇలా జట్టులో ఒకరిని మించి మరొక బౌలర్‌ ఉన్నాడు. పాక్‌ జట్టులో ఇప్పుడే కాదు.. వాళ్లు క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచి పేసర్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ల తర్వాత ఆ బాధ్యత షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ సమీ, సోహైల్‌ తన్వీర్‌, మహ్మద్‌ ఆమిర్‌, మహ్మద్‌ ఆసిఫ్‌లు తీసుకున్నారు. వీరి తర్వాత వచ్చినవాళ్లే ప్రస్తుతం పాక్‌ జట్టులో ఉన్న స్టార్‌ బౌలర్లుగా వెలుగొందుతున్నారు.

ఇక పాక్‌ జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌ నసీమ్‌ షా(19) ఒక సంచలనం. తనదైన స్వింగ్‌.. పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగల సమర్థుడు. అయితే టి20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించనప్పటికి తనదైన రోజున అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. పదునైన పేస్‌ బౌలింగ్‌తో వికెట్లు రాబట్టగల నైపుణ్యం అతని సొంతం. ఈ ఏడాది ఆసియా కప్‌లో టీమిండియాపై తొలి అంతర్జాతీయ టి20 ఆడిన నసీమ్‌ షా డెబ్యూ మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన కనబరిచాడు.

షాహిన్‌ అఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన నసీమ్‌ షా తన పదునైన బంతులతో టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.  ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నసీమ్‌ షా 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా పాక్‌ బౌలింగ్‌లో కీలకంగా మారిన నసీమ్‌ షా టి20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లాడిన నసీమ్‌ మూడు వికెట్లు తీశాడు.

తాజాగా నసీమ్‌ షా తమ్ముడు హునైన్‌ షా(18) అన్నను మించిపోయేలా ఉన్నాడు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆడుతున్న హునైన్‌ షా మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ మాత్రమే తీసినప్పటికి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గుడ్‌ లెంగ్త్‌తో వేసిన బంతి బ్యాటర్‌ చేతిని తాకి ఆ తర్వాత బ్యాట్‌ను తాకి గాల్లోకి లేవడం.. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ క్యాచ్‌ తీసుకోవడం జరిగిపోయింది.

బ్యాటర్‌ తన చేతికి బంతి గట్టిగా తగలడంతో నొప్పితో బాధపడిన అతను పెవిలియన్‌కు వెళ్తూ రాసుకోవడం కనిపించింది. ఇక హునైన్‌ షాకు ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. అయితే మ్యాచ్‌లో 76 పరుగులిచ్చిన హునైన్‌ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకన్నాడు. మొత్తానికి అన్న నసీమ్‌ షా అడుగు ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టులో పడింది.. ఇక ఇప్పుడు తమ్ముడి వంతు త్వరలో రాబోతుందంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేసింది.

చదవండి: వర్షంతో మ్యాచ్‌ రద్దు.. వింత గేమ్‌ ఆడిన భారత్‌, కివీస్‌ ఆటగాళ్లు 

మరిన్ని వార్తలు