క్రికెట్‌కు ఉమర్‌ గుల్‌ గుడ్‌బై

18 Oct, 2020 05:45 IST|Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటించిన పాక్‌ పేసర్‌

కరాచీ: పాకిస్తాన్‌ సీనియర్‌ పేస్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న పాక్‌ దేశవాళీ టోర్నీ టి20 కప్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన గుల్‌... అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టిన గుల్‌... 130 వన్డేల్లో 179 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20ల్లో గుల్‌ మరో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

సుమారు దశాబ్దకాలం పాటు పాక్‌ జట్టు ప్రధాన పేసర్‌గా పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన గుల్‌ కెరీర్‌ వరుస గాయాలతో ఒడిదుడుకులకు లోనైంది. అంతర్జాతీయ టి20ల్లో టాప్‌–10లో రెండు అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనలు (5/6, 5/6) నమోదు చేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. యార్కర్‌ స్పెషలిస్ట్‌గా ప్రత్యేకత ప్రదర్శించిన గుల్‌... 2007 టి20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను ఫైనల్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల తర్వాత పాక్‌ గెలుచుకున్న టి20 వరల్డ్‌ కప్‌లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గుల్‌ కావడం విశేషం. పాకిస్తాన్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను అతను నాలుగేళ్ల క్రితం 2016లో ఆడాడు.

మరిన్ని వార్తలు