Virat Kohli: ఇదేం చిత్రం.. కోహ్లి సెంచరీ కోసం పాక్‌ ఆటగాళ్ల మొక్కులు

1 Feb, 2022 16:03 IST|Sakshi

టీమిండియా మెషిన్‌ గన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ మార్క్‌ సాధించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. కోహ్లి సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్‌ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్‌ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్‌ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్‌ఎల్‌(పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ స్ట్రాటెజీ మేనేజర్‌ హసన్‌ చీమా తన ట్విటర్‌లో వెల్లడించాడు.

చదవండి: ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్‌.. రెండో స్థానంలో సమ్మర్‌ ఒలింపిక్స్‌

''పీఎస్‌ఎల్‌ గురించి ఎక్కువగా ట్వీట్‌ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్‌ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్‌ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకే ప్రత్యర్థులం కానీ క్రికెట్‌లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లియే ఉదాహరణ. కోహ్లి కచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు.'' అని ట్వీట్‌ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు.. ''ఇదేం చిత్రమో.. బయటకు మాత్రం మా చేతిలో పాక్‌ ఓడిపోతే.. మన దేశాన్ని తిడతారు.'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక కోహ్లి ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే వన్డే, టి20 కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కోహ్లి పర్వాలేదనిపించాడు. అందరు విఫలమైనచోటు తాను కాస్త సక్సెస్‌ అయ్యాడు. కేప్‌టౌన్‌ టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే , మూడో వన్డేలో హాఫ్‌ సెంచరీలు సాధించినప్పటికి.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురుచూస్తున్న కోహ్లి అభిమానుల కల.. విండీస్‌తో సిరీస్‌లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడనుంది.

చదవండి: సిక్స్‌ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్‌; ఆఖరి బంతికి ట్విస్ట్‌

మరిన్ని వార్తలు