పాకిస్తాన్‌ షాన్‌దార్‌

7 Aug, 2020 03:18 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 326 ఆలౌట్‌

చెలరేగిన బౌలర్లు

ఇంగ్లండ్‌ 92/4

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు పాకిస్తాన్‌ సత్తా చాటింది. ముందుగా ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (319 బంతుల్లో 156; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించిన పాక్‌... ఆ తర్వాత తమ  పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఫలితంగా గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్‌ (4), సిబ్లీ (8)లతో పాటు స్టార్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ (0), కెప్టెన్‌ జో రూట్‌ (14) కూడా పెవిలియన్‌ చేరారు. ప్రస్తుతం ఒలీ పోప్‌ (46 బ్యాటింగ్‌), బట్లర్‌ (15 బ్యాటింగ్‌)  క్రీజ్‌లో ఉన్నారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో షాహిన్‌ అఫ్రిది వికెట్‌ తీయగా... తర్వాతి రెండు వికెట్లు మొహమ్మద్‌ అబ్బాస్‌ ఖాతాలో చేరాయి. యాసిర్‌ షా మరొ వికెట్‌ పడగొట్టాడు. అంతకు ముందు పాక్‌ 326 పరుగుకు ఆలౌటైంది. మసూద్‌కు షాదాబ్‌ ఖాన్‌ (45) అండగా నిలిచాడు.  

ఓవర్‌నైట్‌ స్కోరు 139/2తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ తొలి ఓవర్లోనే అదే స్కోరు వద్ద బాబర్‌ ఆజమ్‌ (69) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే అసద్‌ షఫీఖ్‌ (7), రిజ్వాన్‌ (9) వెనుదిరిగారు. ఈ దశలో మసూద్, షాదాబ్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో 251 బంతుల్లో మసూద్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కాగా... వరుసగా మూడోది కావడం విశేషం. గత రెండు ఇన్నింగ్స్‌లలో అతను 135 (శ్రీలంకపై), 100 (బంగ్లాదేశ్‌పై) పరుగులు సాధించాడు. ఎట్టకేలకు షాదాబ్‌ను బెస్‌ అవుట్‌ చేయడంతో 105 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. సెంచరీ తర్వాత మరో 60 బంతుల్లోనే 150కు చేరుకున్న మసూద్‌ చివరకు తొమ్మిదో వికెట్‌గా అవుటయ్యాడు.

>
మరిన్ని వార్తలు