Chess Olympiad 2022: భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్‌..

29 Jul, 2022 08:46 IST|Sakshi

భారత్, పాక్‌ల మధ్య సత్సబంధాల్లేవ్‌. గరువారం భారత్‌లోని చెన్నై వేదికగా 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ టోర్నీ కావడంతో ‘ఫిడే’ పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపింది. కానీ పాక్‌ తన వక్రబుద్ధిని చూపిస్తూ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది.

ఈ నెల జూలై 21 జమ్మూ కశ్మీర్‌లో ఒలింపియాడ్‌కు సంబంధించిన ‘టార్చ్‌ రిలే’ మొదలైంది. అయితే దీనిపై పాకిస్తాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఆఖరి నిమిషంలో టోర్నీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి అరిందమ్‌ బాగ్చి అసహనం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం.  పక్కదేశానికి అభ్యంతరమేంటి? అయినా ప్రతిష్టాత్మక క్రీడల్లో ఆడేందుకువచ్చి రాజకీయ రగడ చేయడం విచారకరం’ అని అన్నారు.

ఇక ప్రధాని చేతుల మీదుగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్‌ వాళ్తు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.  చెస్‌ ఒలంపియాడ్‌ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్‌ అందుకున్నారు.

తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్‌ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, మరో మంత్రి ఎల్‌. మురుగన్‌ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

చదవండి: చెస్‌ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..!

Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?

మరిన్ని వార్తలు