AFG Vs PAK: చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే

28 Mar, 2023 07:07 IST|Sakshi

పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తటస్థ వేదికలో పాకిస్తాన్‌పై సిరీస్‌ గెలవడం ఆఫ్గన్‌కు ఇదే తొలిసారి. సోమవారం రాత్రి జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్‌ అయూబ్‌ 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్‌ ఖాన్‌ 28 పరుగులు చేశాడు.

అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్‌ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్‌ అయింది. అజ్మతుల్లా ఒమర్‌జెయ్‌ 21 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్‌ ఖాన్‌, ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆఫ్గన్‌ ఆటతీరుపై అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమయింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన షాదాబ్‌ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రాగా.. సిరీస్‌ ఆద్యంతం తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్‌ నబీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు