వాటే సిరీస్‌.. భారత్‌ చారిత‍్రక విజయం: పాక్‌ ఫ్యాన్స్‌

19 Jan, 2021 20:48 IST|Sakshi

టీమిండియాపై పాక్‌ అభిమానుల ప్రశంసలు

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్‌ అభిమానులతో పాటు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు భారత జట్టును కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తుండటంతో టీమిండియా హాష్‌టాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆసీస్‌ గడ్డపై భారత్‌ అపూర్వ విజయాన్ని ఆస్వాదిస్తూ సోషల్‌ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు గబ్బాలో ఓటమి రుచి చూపించిన తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పంత్‌, గిల్‌, సిరాజ్‌, పుజారా, వాషింగ్టన్‌ సుందర్‌, ఠాకూర్‌ల ప్రదర్శన అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆసీస్‌ హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ సైతం విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కితాబిచ్చాడు.

ఇక దాయాది దేశం పాకి​స్తాన్‌ వాసులు సైతం భారత జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడం విశేషం. రహానే కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ సానుకూల కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాటే సిరీస్‌.. చారిత్రాత్మక విజయం. భారత్‌కు శుభాకాంక్షలు. టీమిండియా చూపిన పట్టుదల అమోఘం. భారత జట్టు నేడు వారి క్లాస్‌ ఆటను చూపించింది. మీరు ఇలాగే ఆడుతూ ఉండాలి. పాకిస్తాన్‌ నుంచి మీకు అభినందనలు’’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఇంతటి ఘన విజయం. రిషభ్‌ పంత్‌ అత్యద్భుతం. ఇండియా వలె పాకిస్తాన్‌ జట్టు కూడా మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం’’ అంటూ మాలిక్‌ రెహమాన్‌ అనే వ్యక్తి ఆకాంక్షించారు.(చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం

ఇక మరొకరు.. ‘‘కీలక ఆటగాళ్లు లేరు కాబట్టి ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతుంది అని అంతా భావించారు. కానీ మీరు మాత్రం అద్భుత పోరాటపటిమ కనబరిచి మీ అభిమానుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేశారు. శుభాకాంక్షలు అని మరొకరు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో #AUSvsIND పాకిస్తాన్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక పాక్‌ క్రీడాభిమానుల ప్రశంసలకు సానుకూలంగా స్పందించిన ఇండియన్‌ నెటిజన్లు.. సౌతాఫ్రికాతో జరుగబోయే సిరీస్‌కు మీకు ఆల్‌ ది బెస్ట్‌ అని విషెస్‌ చెబుతున్నారు. కాగా భారత్‌- పాక్‌ల మధ్య మ్యాచ్‌ అంటేనే అసలైన మ్యాచ్‌ అని, ప్రత్యర్థి జట్టును ఓడించడంలోనే సిసలైన మజా ఉంటుందంటూ ఇరు జట్ల అభిమానులు భావిస్తారన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఆసీస్‌ గడ్డపై భారత్‌ విజయాన్ని అభినందిస్తూ మరో ఉపఖండ జట్టు ఫ్యాన్స్‌ ట్వీట్లు చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం.

Poll
Loading...
మరిన్ని వార్తలు