Shan Masood: సోదరి మరణం.. గుడ్‌ బై చెప్పలేనంటూ క్రికెటర్‌ భావోద్వేగం

4 Oct, 2021 10:53 IST|Sakshi

Shan Masood Gets Emotional: పాకిస్తాన్‌ క్రికెటర్‌ షాన్‌ మసూద్‌ నివాసంలో విషాదం నెలకొంది. అతడి సోదరి మీషూ మరణించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించిన మసూద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘మీషూ.. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు. నీకు నేను గుడ్‌బై చెప్పలేను. ఆ దేవుడు నిన్ను ఇంతకంటే మంచి చోటుకు తీసుకువెళ్లాడని నాకు తెలుసు. అయినా.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా’’ అని ట్వీట్‌ చేశాడు. తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించమని అభిమానులను కోరాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, అన్వర్‌ అలీ, అబిద్‌ అలీ, పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా తదితరులు మసూద్‌ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కాగా తన సోదరి మీషూ(30) అరుదైన క్రోమోజోమ్‌ డిజార్డర్‌తో బాధపడుతోందని మసూద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘తను  దివ్యాంగురాలు. నవజాత శిశువుతో సమానం. శారీరక ఎదుగుదల ఉంది కానీ.. మానసికంగా పరిపక్వత చెందలేదు. తనకు డిపెండెంట్‌ వీసా కూడా లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం తమను విడిచి శాశ్వతంగా దూరం కావడంతో శోక సంద్రంలో మునిగిపోయాడు. 

ఇక కెరీర్‌ విషయానికొస్తే... 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో పాకిస్తాన్‌ తరఫున మసూద్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. చివరగా న్యూజిలాండ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు ఆడాడు. ఇక 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం నేషనల్‌ టీ20 కప్‌లో భాగంగా సింధ్‌ తరఫున ఆడుతున్నాడు. 

మరిన్ని వార్తలు