యువ రెజ్లర్‌ పూర్ణిమకు ఆర్థిక సహాయం

1 Apr, 2022 22:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌, సబ్‌ జూనియర్‌ జాతీయ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌కు చెందిన రెజ్లింగ్‌ క్రీడాకారిణి పూర్ణిమకు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌-నాచారం) యాజమాన్యం ఏడాదిపాటు ఆర్థిక సహాయం చేయనుంది.

16 ఏళ్ల పూర్ణిమకు ప్రతి నెల రూ.10 వేలు ఏడాదిపాటు డీపీఎస్‌-నాచారం అందజేస్తుంది. ఈ మేరకు నాచారంలోని డీపీఎస్‌లో జరిగిన కార్యక్రమంలో పూర్ణిమకు రూ. 10 వేల చెక్‌ను డీపీఎస్‌ ప్రతినిధి మల్కా యశస్వి అందించారు. గత ఏడాది బళ్లారిలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ క్యాడెట్‌ చాంపియన్‌షిప్‌లో పూర్ణిమ 61 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్‌) ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, రెజ్లింగ్ కోచ్ నర్సింగ్ ముదిరాజ్, పూర్ణిమ తండ్రి జుమ్మి, రెజ్లర్లు మెట్టు శివ, మోహన్ గాంధీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు