హుసాముద్దీన్‌కు కాంస్యం

20 Dec, 2020 06:50 IST|Sakshi

అమిత్‌కు స్వర్ణ పతకం

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నీ

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. జర్మనీలోని కొలోన్‌లో శనివారం జరిగిన పురుషుల 57 కేజీల సెమీస్‌లో నిజామాబాద్‌ జిల్లా బాక్సర్‌ హుసాముద్దీన్‌ జర్మనీకి చెందిన హమ్‌సత్‌ షడలోవ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ పసిడి పతకం నెగ్గాడు. ఫైనల్లో అతని ప్రత్యర్థి అర్గిష్టి టెట్రెర్యాన్‌ (జర్మనీ) వాకోవర్‌ ఇవ్వడంతో అమిత్‌ రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్‌ 91 కేజీల విభాగంలో సతీశ్‌ కుమార్‌ రజతంతో సంతృప్తి చెందాడు. గాయం కారణంగా సతీశ్‌ ఫైనల్లో పోటీపడలేదు. మహిళల 57 కేజీల విభాగంలో సాక్షి, మనీషా ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో సాక్షి 4–1తో రమోనా గ్రాఫ్‌ (జర్మనీ)పై, మనీషా 5–0తో సోనియా (భారత్‌)పై నెగ్గారు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత పూజా రాణి, గౌరవ్‌ సోలంకీ సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యాలను గెలుచుకున్నారు.

మరిన్ని వార్తలు