పంత్‌ కల ఏంటో చెప్పిన రైనా

24 Jan, 2021 16:12 IST|Sakshi

న్యూఢిల్లీ: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో రాణించి మ్యాచ్‌ని డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రిషభ్‌ పంత్‌ బ్రిస్బేన్‌ టెస్టులో మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ని గెలిపించాడు. పంత్‌ ఆటను ఆ మ్యాచ్‌ ద్వారా సిరీస్‌ గెలుపు భారత క్రికెట్‌ అభిమానులు గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటుంది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో పంత్‌ 68.50 సగటుతో 274 పరుగులు చేయడం విశేషం. అయితే, వికెట్‌ కీపర్‌గా మాత్రం పంత్‌ కొన్ని తప్పిదాలతో సులభ సాధ్యమైన క్యాచ్‌లను నేలపాలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌లో అదరగొడుతున్న పంత్‌ను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 
(చదవండి: ‘కెప్టెన్‌ అడిగితే కాదనగలమా’)

ఈక్రమంలో మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా పంత్‌ గురించి చెప్పిన విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రపంచంలో బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మెన్‌గా ఎదగడం తన కల అని పంత్‌ గతంలో చెప్పినట్టు రైనా పేర్కొన్నాడు. అతను ప్రతిభ గల ఆటగాడని కొనియాడాడు. భారత క్రికెట్ జట్టులో మేటి ప్లేయర్‌గా ఎదిగే సత్తా పంత్‌కు ఉందని రైనా తెలిపాడు. అతను బ్యాటింగ్‌లో రాణించని సమయంలో మీడియాలో విమర్శలు పరిపాటిగా మారాయని, వాటన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలన్న కసి అతనిలో కనిపించేదని రైనా గుర్తు చేసుకున్నాడు. తన కుటుంబంతో కూడా పంత్‌కు చక్కటి సంబంధాలు ఉన్నాయని రైనా వివరించాడు. 

అతనితో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లిన సందర్భాల్లో పంత్‌ అన్ని విషయాలు చర్చించేవాడని, ముఖ్యంగా ఆటకు సంబంధించి ఎక్కువగా ముచ్చట్లు సాగేవని అన్నాడు. పంత్‌కు సాయమేదీ చేయలేదని, కేవలం తన ఆలోచనలు పంచుకునే వ్యక్తిగా ఉన్నానని తెలిపాడు. పంత్‌ తన దగ్గర కోరుకుంది అదేనని రైనా పేర్కొన్నాడు. 23 ఏళ్ల పంత్‌ ముందు అనేక సవాళ్లున్నాయని,  ఆసీస్‌ సిరీస్‌లో మాదిరి అతను మెరుగ్గా రాణిస్తే టీమిండియా సంతోషిస్తుందని రైనా తెలిపాడు. ఇక వ్యక్తిగత కారణాలతో గత ఐపీఎల్‌ సీజన్‌కు డుమ్మా కొట్టిన రైనాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తాజా సీజన్‌కు అట్టిపెట్టుకోవడం తెలిసిందే.
(చదవండి: చెన్నైతోనే సురేశ్‌ రైనా)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు