నన్నెందుకు పక్కన పెట్టారు

26 Aug, 2020 13:16 IST|Sakshi

జాతీయ శిబిరంలో అవకాశం ఇవ్వకపోవడంపై పారుపల్లి కశ్యప్‌ ఆగ్రహం

ఏ ప్రాతిపదికన ఇతరులను ఎంపిక చేశారన్న హైదరాబాద్‌ షట్లర్‌

హైదరాబాద్‌: జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు తనను ఎంపిక చేయకపోవడంపై సీనియర్‌ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఏ ప్రాతిపదికపైన ఎనిమిది మందికే అవకాశం ఇచ్చారని అతను సూటిగా ప్రశ్నించాడు. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ఈ క్యాంప్‌ జరుగుతోంది. ఇందులో 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందినే (సింధు, సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, చిరాగ్, సాత్విక్‌) శిక్షణ కోసం ఎంపిక చేశారు. తాను కూడా ప్రస్తుతం ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ఉన్నానని, ఆ అవకాశం తనకూ ఉందని అతను గుర్తు చేశాడు. ‘నా దృష్టిలో ఎనిమిది మందినే అనుమతించడంలో అసలు అర్థం లేదు. నాకు తెలిసి ఒలింపిక్స్‌కు ముగ్గురు మాత్రమే ఇప్పటికే దాదాపుగా అర్హత సాధించారు. మిగిలినవారు అర్హత సాధించడం అంత సులువేం కాదు. ఈ జాబితాలో శ్రీకాంత్, మహిళల డబుల్స్‌ జోడి కూడా ఉన్నారు. సాయిప్రణీత్, శ్రీకాంత్‌ల తర్వాత నేను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉన్నాను. నా పేరును ఎందుకు పరిశీలించలేదు’ అని కశ్యప్‌ అన్నాడు.  

‘సాయ్‌’ స్పందించలేదు... 
ఈ జాబితాను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) రూపొందించిందని, అందుకే కోచ్‌ గోపీచంద్‌ సలహాపై వారినే ఈ విషయంలో ప్రశ్నించినా... సంతృప్తికర సమాధానం రాలేదని కశ్యప్‌ అసహనం వ్యక్తం చేశాడు. ‘సాయ్‌ డీజీని నేను ఇదే విషయం అడిగాను. మరో 7–8 అర్హత టోర్నీలు మిగిలి ఉన్న ప్రస్తుత దశలో ఈ ఎనిమిది మందినే ఎంపిక చేయడానికి, తనను పరిగణలోకి తీసుకుపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించాను. ఒక రోజు తర్వాత ‘సాయ్‌’ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫోన్‌ చేసి ఉన్నతాధికారుల సూచనలతోనే ఈ పేర్లు చెప్పామని, వీరికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్నట్లుగా తాము భావించామని అన్నారు. ఆ ఎనిమిది మంది అనారోగ్యం బారిన పడకుండా ఒలింపిక్స్‌ వరకు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. అయితే వారంతా క్యాంప్‌లో ఉండటం లేదు. బయట తమకు నచ్చినవారిని కలుస్తున్నారు కూడా. మరి వారిని ఆరోగ్యంగా ఉంచుతామని అనడంలో అర్థమేముంది’ అని కశ్యప్‌ ఘాటుగా వ్యాఖ్యానించాడు. గోపీచంద్‌ అకాడమీలో ప్రస్తుతం 9 కోర్టులు ఉంటే వేర్వేరు సమయాల్లో నలుగురు మాత్రమే ప్రాక్టీస్‌ చేస్తున్నారని... మిగిలిన సమయంలో తమకు శిక్షణకు అవకాశం ఇవ్వడంలో అభ్యంతరం ఏముందని అతను అన్నాడు. వీరి కోసం 9 మంది కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు కూడా పని చేస్తున్నారని గుర్తు చేసిన కశ్యప్‌... శిక్షణకు అవకాశం ఇవ్వకపోతే తాను ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించగలనని అతను తన ఆవేదనను ప్రకటించాడు.

మరిన్ని వార్తలు