కరోనా బారిన కశ్యప్‌...

6 Dec, 2020 04:04 IST|Sakshi

ప్రణయ్, గురుసాయిదత్, ప్రణవ్‌ చోప్రాలు కూడా ‘పాజిటివ్‌’

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. కశ్యప్‌తోపాటు భారత ఇతర షట్లర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్, ప్రణవ్‌ చోప్రాలకు కూడా కోవిడ్‌–19 పాజిటివ్‌ వచ్చింది. ‘ఈ నలుగురు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఈ నలుగురిలో ఒకరికి కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నారు.

కశ్యప్, గురుసాయిదత్, ప్రణవ్, ప్రణయ్‌లకు పాజిటివ్‌ రాగా... కశ్యప్‌ భార్య, స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు నెగెటివ్‌ వచ్చింది. కొన్నిసార్లు తొలి పరీక్షలో ఫాల్స్‌ పాజిటివ్‌ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులు వేచి చూశాక మళ్లీ పరీక్షకు హాజరు కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సోమవారం వీరందరూ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు’ అని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ వర్గాలు తెలిపాయి. నవంబర్‌ 25న వివాహం చేసుకున్న గురుసాయిదత్‌ ప్రాక్టీస్‌ నుంచి విరామం తీసుకోగా... మిగతా ఆటగాళ్లు గోపీచంద్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు