పాస్‌పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్‌ దూరం?

24 Feb, 2021 19:12 IST|Sakshi

కొలంబో: విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. అయితే పాస్‌పోర్టు లేకపోతే ఇతర దేశాలకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ పాస్‌పోర్టు పోగొట్టుకోవడంతో ఆ దేశ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విలువైన మ్యాచ్‌లను కోల్పోయే పరిస్థితి వచ్చింది. పాస్‌పోర్ట్‌ లేదని ఆలస్యంగా గుర్తించగా.. మళ్లీ కొత్తది తీసుకోవడానికి సమయం పడుతుండడంతో ఆ కెప్టెన్‌ మ్యాచ్‌లకు హాజరవడం అనుమానంగా ఉంది.

శ్రీలంక టీ20 కెప్టెన్‌ దాసూన్‌ శనక. వెస్టిండీస్‌ టూర్‌కు ఆయన సారథ్యంలో శ్రీలంక జట్టు వెళ్లింది. శ్రీలంక- వెస్టిండీస్‌ మధ్య మొత్తం మూడు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీనికోసం షెడ్యూల్‌ ఖరారైంది. మార్చ్‌ 2 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు వెస్టిండీస్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు శ్రీలంక ఆటగాళ్లు వెస్టిండీస్‌కు మంగళవారం పయనమవగా.. టీ20 కెప్టెన్‌గా ఉన్న దాసూన్‌ శనక వెళ్లలేదు. పాస్‌పోర్టు లేదని గ్రహించాడు. దీంతో వెస్టిండీస్‌ ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 

రెండేళ్ల కిందట పాస్‌పోర్ట్‌ పోయిందని దాసూన్‌ శనక తెలిపాడు. తనకు ఐదేళ్ల యూఎస్‌ వీసా ఉండగా అది వెస్టిండీస్‌ వెళ్లేందుకు ఉపయోగపడదు. ప్రస్తుతం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగా అది వచ్చేందుకు సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో శనక వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లడం అనుమానంగా ఉంది. పాస్‌పోర్టు లేకపోవడం కారణంగా మ్యాచ్‌లకు దూరం కావడం అనేది జీర్ణించుకోలేని విషయం.

మరిన్ని వార్తలు