అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్‌

2 Jun, 2021 20:05 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారాపై ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో పటిష్టమైన రాతి గోడ అని, బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చే బంతులను సైతం అతను అడ్డుకోగల సమర్ధుడని, నేటి తరంలో అలాంటి క్లాస్‌ ఆటగాడిని చూడలేదని కొనియాడాడు. క్రీజులో అతను చూపించే ఓపికకు ఎంతటి బౌలర్‌ అయినా దండం పెట్టాల్సిందేనని ఆకాశానికెత్తాడు. గబ్బా టెస్ట్‌లో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూశానని, ఓ ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ.. పుజారాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

పుజారాతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదని, అయినా అతని గురించి ఎంతో తెలుసన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. ఇటీవల తమతో జరిగిన సిరీస్‌లో పుజారా అంత ప్రభావం చూపలేడని తొలుత భావించామని, కానీ సిడ్నీ, గబ్బా టెస్ట్‌ల్లో అతను బ్యాటింగ్‌ చేసిన తీరు చూసి అవాక్కయ్యామని తెలిపాడు. ముఖ్యంగా నాలుగో టెస్ట్‌లో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్న విధానాన్ని చూస్తే ఎంతటివారైనా సలామ్‌ అనాల్సిందేనని అన్నాడు. భీకరమైన బంతులు శరీరాన్ని గాయపరిస్తే, పంటి బిగువన నొప్పిని భరించాడన్నాడు. అతనిలా జట్టు ప్రయోజనాల కోసం దెబ్బలు తగిలించుకున్న ఆటగాడిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. 

రాతి గోడపైకి బంతిని సంధిస్తే ఎలా ఉంటుందో, అతని డిఫెన్స్‌ కూడా అదేలా ఉంటుందని కొనియాడాడు. కాగా, టీమిండియా ఆటగాళ్ల అత్యద్భుత పోరాట పటిమ కారణంగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్ పంత్‌లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడి, టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు.
చదవండి: ICC RANKINGS: రెండో ర్యాంక్‌ నిలబెట్టుకున్న కోహ్లీ

మరిన్ని వార్తలు