కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!

24 Sep, 2020 09:04 IST|Sakshi

అబుదాబి : 2019 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను రూ. 15 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక బౌలర్‌కు అన్ని కోట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 3ఓవర్లలోనే 4 సిక్సులు, మూడు ఫోర్లు సమర్పించుకొని 49 పరుగులు ఇచ్చేశాడు. తొలి స్పెల్‌లో 5వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్‌ను రోహిత్‌ ఒక ఆట ఆడుకున్నాడు. కమిన్స్‌ ఆ ఓవర్లో షార్ట్‌​ బాల్స్‌ సంధించగా.. రోహిత్‌ రెండు బారీ సిక్స్‌లు బాదాడు. (చదవండి : సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్‌.. ముంబై స్కోరెంతంటే)

15వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్‌ను ఈసారి సౌరబ్‌ తివారి ఆడుకున్నాడు. ఈ ఓవర్‌లో తివారి ఒక సిక్స్‌, ఫోర్‌తో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. ఇక 17వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా వంతు వచ్చింది.. కమిన్స్‌ వేసిన ఆ ఓవర్లో హార్దిక్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 19 రన్స్‌ పిండుకున్నాడు. అయితే కమిన్స్‌ బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన కమిన్స్‌ మొత్తం 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 12 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. కానీ కమిన్స్‌ను ఒక స్టార్‌ బౌలర్‌గానే చూసిన కోల్‌కతా అతని నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం పట్ల కాస్త నిరాశకు లోనైంది.  

టెస్టుల్లో నెంబర్‌ 1 బౌలర్‌గా ఉన్న కమిన్స్‌ నిన్న జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే 49 పరుగులు ఇచ్చి ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.  2011 ఐపీఎల్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇదే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్మీపతి బాలాజీ 3 ఓవర్లలోనే 51 పరుగులు ఇచ్చి ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేశాడు. బాలాజీ తర్వాత 49 పరుగులు ఇచ్చిన కమిన్స్‌ జైదేవ్‌‌ ఉనాద్కట్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.(చదవండి : ఏడు సీజన్‌ల తర్వాత ‘తొలి’ ఓటమి)

 మ్యాచ్‌ ముగిసిన అనంతరం కమిన్స్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. 'కమిన్స్‌.. కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా ఆడితే ఎలా' అంటూ పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం కమిన్స్‌కు మద్దతు ఇచ్చారు.' కమిన్స్‌కు ఈ ఐపీఎల్‌లో ఇది మొదటి మ్యాచ్‌ మాత్రమే.. రానున్న రోజుల్లో తన మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే అవకాశం ఉందంటూ ' పలువురు పేర్కొన్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (28 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. 

మరిన్ని వార్తలు