PCB: లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి

1 Jan, 2023 08:30 IST|Sakshi

పీసీబీకి సంకటస్థితి ఏర్పడింది. లేక లేక పాకిస్తాన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుంటే ఆదరణ కరువయింది. అభిమానులు మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో స్టేడియాలన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సిరీస్‌కు అంతో ఇంతో ఆదరణ దక్కగా.. తాజాగా కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులే కరువయ్యారు. దీనికి తోడూ పాక్‌ వరుస ఓటములు కూడా అభిమానులకు నిరాశకు గురి చేశాయి. కరాచీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ప్రేక్షకులు లేక స్టేడియం వెల వెల బోయింది. దీంతో రెండో టెస్టు నుంచి ఉచితంగా ఆడియెన్స్‌ను అనుమతించనుంది. ఈ మేరకు పీసీబీ ప్రకటన విడుదల చేసింది.

"మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఒరిజినల్ ఐడీ కార్డు లేదా బీ ఫారం తీసుకుని స్టేడియానికి వస్తే ఉచితంగా ఎంట్రీ లభిస్తుంది. ఇమ్రాన్ ఖాన్, క్వాద్, వసీం అక్రమ్, జహీర్ అబ్బాస్ పేరిట ఉన్న ప్రీమియం లాంజ్‌లకు వెళ్లి చూసే అవకాశం కూడా ఉంది. ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ విభాగంలో ఏ ప్రదేశంలోనైనా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించవచ్చు.  పీసీబీ నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనా, గరీబ్ నవాజ్ పార్కింగ్ ఏరియాలోనూ ప్రేక్షకులకు అనుమతి ఉంది. అంటూ పేర్కొంది. మరి ఉచిత ఎంట్రీ అయినా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పిస్తుందేమో చూడాలి. 

ఇక కరాచీ వేదికగా జరిగిన తొలి టెస్టు పేలవ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 438 పరుగులు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో రాణించడంతో 612 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను పాక్ 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కివీస్ విజయానికి 15 ఓవర్లలో 138 పరుగులు అవసరం కాగా..  7.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేయగా.. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

చదవండి: నిలకడగా రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం

మరిన్ని వార్తలు