పాకిస్తాన్‌ క్రికెట్‌లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్‌, తాజాగా కోచ్‌లు

15 Mar, 2023 13:25 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్‌ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్‌ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్‌ ఖాన్‌ను, హెడ్‌ కోచ్‌గా అబ్దుల్‌ రెహ్మాన్‌ను, బ్యాటింగ్‌ కోచ్‌గా మహ్మద్‌ యూసఫ్‌ను, బౌలింగ్‌ కోచ్‌గా ఉమర్‌ గుల్‌ను నియమించింది.

సెలెక్షన్‌ కమిటీ నూతన చీఫ్‌ హరూన్‌ రషీద్‌ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్‌ లోడ్‌ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్‌ కోచ్‌, కోచింగ్‌ సిబ్బంది, నాన్‌ కోచింగ్‌ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.

గత కొంతకాలంగా బాబర్‌ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్‌ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం​ చుట్టినట్లు సమాచారం. 

కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనున్న విషయం తెలిసిం‍దే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్‌, కోచింగ్‌, నాన్‌ కోచింగ్‌ స్టాఫ్‌) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతు‍న్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

బాబర్‌ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, షాహీన్‌ అఫ్రిది, ఫకర్‌ జమాన్‌, హరీస్‌ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ..  సైమ్‌ అయూబ్‌, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. 

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు..
షాదాబ్‌ ఖాన్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్‌, ఆజమ్‌ ఖాన్‌ (వికెట్‌కీపర్‌), ఫహీమ్‌ అష్రాఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఇహసానుల్లా, ఇమాద్‌ వసీం, మహ్మద్‌ హరీస్‌ (వికెట్‌కీపర్‌), మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీం, నసీం షా, సైమ్‌ అయూబ్‌, షాన్‌ మసూద్‌, తయాబ్‌ తాహిర్‌, జమాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు