Ramiz Raja: గంగూలీ పిలిచినా వెళ్లలేదు.. ఐపీఎల్‌ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 Jun, 2022 15:31 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్‌ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు చూసేందుకు బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ గతంలో తనను రెండుసార్లు (2021, 2022)  ఆహ్వానించాడని, అయినా తాను గంగూలీ ఆహ్వానాన్ని తిరస్కరించానని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ మీడియా హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయిన అంశంపై పాక్‌ మీడియా అడిగిన ప్రశ్నల సందర్భంగా రమీజ్‌ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. 

ఈ సందర్భంగా రమీజ్‌ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బీసీసీఐ బాస్‌ తనను ఆహ్వానించాడని, అయినా తాను వెళ్లలేకపోయానని అన్నాడు. గంగూలీ నుంచి ఆహ్వానం అందాక వెళ్లాలా..? వద్దా..? అని చాలా రోజుల పాటు ఆలోచించానని, ఒకవేళ ఐపీఎల్ ఫైనల్స్‌ను వీక్షించేందుకు తాను వెళ్లుంటే పాక్‌ అభిమానులు నన్ను ఎప్పటికీ క్షమించేవారు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

భారత్‌-పాక్‌ల మైత్రిపరమైన సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తాను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వెళ్లే సాహసం చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను ఓ క్రీడలా చూస్తే తాను గంగూలీ ఆహ్వానం మేరకు వెళ్లాల్సిందని, అయితే దాయది దేశాల్లో ఆ పరిస్థితులు లేవని తెలిపాడు. 

ఇదే సందర్భంగా రమీజ్‌ పీసీబీ ప్రతిపాదించిన నాలుగు దేశాల (భారత్‌, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) టీ20 సిరీస్‌పై కూడా స్పందించాడు. పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. నాలుగు దేశాల టీ20 సిరీస్‌పై గంగూలీతో డిస్కస్‌ చేశానని అన్నాడు. ఈ సిరీస్‌ సాధ్యాసాధ్యలపై దాదా త్వరలో ఓ ప్రకటన చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపాడు.
చదవండి: ఇంగ్లండ్‌ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు! అయినా!

మరిన్ని వార్తలు