Shaheen Afridi: '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం'

8 Oct, 2022 08:40 IST|Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పీసీబీ అధ్యక్షుడు రమీజ్‌ రజా వెల్లడించాడు. షాహిన్‌ అఫ్రిది అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు. మోకాలి గాయంతో ఆసియా కప్‌తో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అఫ్రిది దూరమయ్యాడు. దీంతో అఫ్రిది టి20 ప్రపంచకప్‌ ఆడతాడా లేదా అనే సందేహాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే పీసీబీ అధ్యక్షుడు రమీజ్‌ రజా.. టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు షాహిన్‌ అఫ్రిది ఫిట్‌గా ఉన్నట్లు శుక్రవారం మీడియాకు తెలిపాడు. ''మీతో మాట్లాడడానికి ఒక్కరోజు ముందే నేను షాహిన్‌ అఫ్రిదితో మాట్లాడాను. తాను ఫిట్‌గా ఉన్నట్లు షాహిన్‌ చెప్పాడు. వైద్యులు కూడా తమ రిపోర్ట్స్‌లో అదే విషయాన్ని వెల్లడించారు. అతనికి సంబంధించిన వీడియోలను కూడా మాకు పంపించారు. ఆ వీడియోలో షాహిన్‌ ప్రాక్టీస్‌ చూస్తుంటే టీమిండియాతో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక షాహిన్‌ ఫిట్‌గా ఉండడం మాకు సానుకూలాంశం. అయితే టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ వరకు షాహిన్‌ను బరిలోకి దింపొద్దు అనుకున్నాం. కానీ షాహిన్‌ మాత్రం.. ''నేను 110 శాతం ఫిట్‌గా ఉన్నా.. నా గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తా.'' అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటూ'' రమీజ్‌ మీడియాకు వెల్లడించాడు.

ఇక పాకిస్తాన్‌ స్టార్‌ షాహిన్‌ అఫ్రిది గతేడాది టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్‌ను కకావికలం చేసిన అఫ్రిది మూడు వికెట్లతో చెలరేగాడు. ఆ టోర్నీలో సెమీఫైనల్‌ వరకు ఎదురులేకుండా సాగిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో గెలిచిన ఆస్ట్రేలియా చాంపియన్‌గా అవతరించింది.

మోకాలి గాయంతో బాధపడుతున్న మరొక పాక్‌ ఆటగాడు ఫఖర్‌ జమాన్‌ను టి20 ప్రపంచకప్‌కు స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. '' ఫఖర్‌ జమాన్‌ గాయంపై కూడా మంచి ప్రోగ్రెస్‌ ఉంది. అతను తర్వాగా కోలుకుంటున్నట్లు తెలిసింది. ఇదే నిమమైతే ఫఖర్‌ జమాన్‌ స్టాండ్‌ బై నుంచి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది'' అంటూ రమీజ్‌ పేర్కొన్నాడు.

చదవండి: దీపక్‌ చహర్‌కు గాయం..!

ఎదురులేని రిజ్వాన్‌.. గెలుపుతో పాక్‌ బోణీ 

మరిన్ని వార్తలు