ఆసియా కప్‌తో పాటు పీఎస్‌ఎల్‌ షెడ్యూల్‌ కూడా మీరే ప్రకటించండి.. పాకిస్తాన్‌ క్రికెట్‌ చీఫ్‌ వ్యంగ్యం

6 Jan, 2023 13:50 IST|Sakshi

ఆసియా కప్‌ 2023-24 (వన్డే ఫార్మాట్‌) సంవత్సరాలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు ఆసియా వేదికగా జరగాల్సి ఉన్న  అన్ని​ క్రికెట్  సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా నిన్న (జనవరి 5) విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌లో వరుసగా రెండు సంవత్సరాలు భారత్‌, పాక్‌లు ఒకే గ్రూప్‌లో తలపడపడాల్సి ఉంది.

అయితే ఈ క్యాలెండర్‌ ప్రకటనపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ నజమ్‌ సేథీ తాజాగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. ఆతిధ్య దేశమైన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా షెడ్యూల్‌ను ఎలా ప్రకటిస్తారని ట్విటర్‌ వేదికగా జై షాను ప్రశ్నించాడు. అలాగే ఏసీసీ చైర్మన్‌ హోదాలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) షెడ్యూల్‌ కూడా ప్రకటించాలని వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశాడు. పీసీబీ చైర్మన్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

కాగా, ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్‌ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ పెద్దలు ముక్తకంఠంతో ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. తాజాగా జై షా ప్రకటించిన షెడ్యూల్‌లో 2023కు సంబంధించి ఆతిధ్య దేశం (పాక్‌) ప్రస్తావన లేకపోవడంతో పాక్‌కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే భారత్‌కు ఎలాగైనా కౌంటర్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో పీసీబీ చైర్మన్‌ ఈ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు