IND vs PAK: కన్నేసి ఉంచాలంటూ పాక్‌ ఆటగాళ్ల భార్యలను భారత్‌కు పంపించాం!

14 Apr, 2022 16:54 IST|Sakshi
2013లో ఎంఎస్‌ ధోని(భారత్‌ కెప్టెన్‌)- మిస్సా ఉల్‌ హక్‌(పాకిస్తాన్‌ కెప్టెన్‌)

టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. రెండు దేశాలకు తమ గౌరావాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్షతో ఉంటాయి. ఏ జట్టుతో మ్యాచ్‌ ఓడినా పర్లేదు కానీ దాయాది చేతిలో ఓడితే మాత్రం విమర్శలు తప్పవు.  కాగా ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమే అవుతుంది. రెండు దేశాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల మేజర్‌ టోర్నీల్లో తప్ప భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. ఇటీవలే పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా ప్రస్తావించిన నాలుగు దేశాల టోర్నీ ప్రతిపాదనను భారత్‌ తిరస్కరించింది. ఆ టోర్నీలో ఆడబోయేది లేదని భారత్‌ ఐసీసీకి తెలిపింది. 

అయితే పాకిస్తాన్‌ జట్టు భారత్‌లో చివరిసారి 2012-13లో పర్యటించింది. ఆ సమయంలో మూడు వన్డేలు. రెండు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియాకు కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని ఉండగా.. పాకిస్తాన్‌ కెప్టెన్‌గా మిస్బా-ఉల్‌-హక్‌ వ్యవహరించాడు. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో పాక్‌ కైవసం చేసుకోగా.. రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1 డ్రా చేసుకున్నాయి. సిరీస్‌ ఫలితం పక్కనబెడితే.. అప్పుడు జరిగిన ఒక సంఘటనను మాజీ పీసీబీ చైర్మన్‌ జాకా అశ్రఫ్‌ తాజాగా పంచుకున్నాడు. 

పాక్‌ ఆటగాళ్ల వెంబడి వారి భార్యలను కూడా తొలిసారి భారత్‌కు పంపించామని పేర్కొన్నాడు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆయన వివరించాడు. '' పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఎప్పుడు భారత్‌కు వచ్చినా.. ఆ దేశ మీడియా పాక్‌ ఆటగాళ్లపై ఆరోపణలు చేసేది. ఆటగాళ్లు ఎప్పుడు భారత్‌కు వచ్చినా తమ భార్యలను తీసుకురారని.. వాళ్లు రాకపోవడం వల్ల ఇక్కడ తమ సరసాలకు అడ్డు ఉండదని.. ఎవరు ఏం చేసినా అడిగేవారు ఉండరని.. అందుకే పాక్‌ ఆటగాళ్లు తమ భార్యలను తీసుకురారని వార్తలు రాసేవారు. కానీ వీటన్నింటికి చెక్‌ పెట్టడానికే.. పాక్‌ ఆటగాళ్లు వెళ్లిన తర్వాత.. ఒక కన్నేసి ఉంచమని వారి భార్యలను భారతదేశానికి పంపించాను.


పీసీబీ మాజీ చైర్మన్‌ జాకా అశ్రఫ్‌

ఆ సమయంలో వాళ్లు పాక్‌ ఆటగాళ్లతోనే ఉండడంతో అక్కడి మీడియా(భారత్‌ మీడియా)కు వార్తలు రాయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కాగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌.. సెక్యూరిటీ విషయంలో హామీ ఇస్తే పాకిస్తాన్‌ పర్యటనకు భారత్‌ను పంపిస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు ఆ మాట నిలుపుకోలేకపోయారు. అయితే భారత్‌తో సిరీస్‌ ఆడేందుకు ఎప్పటికప్పుడు మా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాం.. కానీ భారత్‌ ఒప్పుకునే ప్రతిపాదనలో కనిపించడం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Tim Southee: ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌

Pollard Run-out: పొలార్డ్‌.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు!

మరిన్ని వార్తలు