WC 2023: చారిత్మాతక డీల్‌.. ఆటగాళ్లకు పీసీబీ గిఫ్ట్‌! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్‌

28 Sep, 2023 17:46 IST|Sakshi

Pakistan announces landmark central contractsవన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. సెంట్రల్‌ కాంట్రాక్టుల విషయంలో చారిత్రాత్మక నిర్ణయంతో కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. 

మెన్స్‌ టీమ్‌లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో ఆటగాళ్లకు మిలియన్‌ యూఎస్‌ డాలర్ల మేర రెవెన్యూ సమకూరనుంది. 

అయితే.. ఓ కండిషన్‌
ఇక ఈ ఏడాది జూలై 1 నుంచే ఒప్పందం అమల్లోకి వస్తుందని.. అయితే, 12 నెలలకొకసారి క్రికెటర్‌ ప్రదర్శనపై సమీక్ష ఆధారంగానే చెల్లింపులు ఉంటాయని పీసీబీ స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక ఒప్పందంలో భాగమయ్యేందుకు అత్యధికంగా 25 మంది క్రికెటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు  బుధవారం నాటి ప్రకటనలో వెల్లడించింది.

అంతేకాకుండా తొలిసారి టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెటర్ల కాంట్రాక్టును మెర్జ్‌ చేసినట్లు పీసీబీ తెలిపింది. సెలక్షన్‌ విషయంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా నెలవారీ ఆదాయంతో పాటు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల ఫీజును 50 శాతానికి, వన్డేలు ఆడేవాళ్ల ఫీజును 25 శాతం, టీ20లు ఆడేవాళ్లకు 12.5 ఫీజును పెంచనున్నట్లు వెల్లడించింది.

మరో రెండు టీ20లీగ్‌లలో
అంతేకాదు.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న పాక్‌ ప్లేయర్లు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో పాటు మరో రెండు ఇతర టీ20 లీగ్‌లు ఆడేందుకు పీసీబీ అనుమతినిచ్చింది. పీసీబీ తమ డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ హర్షం వ్యక్తం చేశాడు.

ఇక పీసీబీ చైర్మన్‌ జకా ఆష్రఫ్‌ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లతో చర్చలు కొలిక్కి వచ్చాయని.. ఇలాంటి డీల్‌ కుదరడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. పాక్‌ క్రికెట్‌ నిజమైన ఆస్తులు ఆటగాళ్లేనని.. వాళ్లు ఆర్థికంగా కూడా బలంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. 

పీసీబీ తాజా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్రకారం..
కేటగిరీ-ఏ: బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌, షాహిన్‌ షా ఆఫ్రిదిలకు 202 శాతం హైక్‌($15,500).
కేటగిరీ-బి: ఫఖర్‌ జమాన్‌, హ్యారిస్‌ రవూఫ్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, మహ్మద్‌ నవాజ్‌, నసీం షా, షాదాబ్‌ ఖాన్‌లకు 144 శాతం హైక్‌($10,000).
కేటగిరీ- సి: ఇమాద్‌ వసీం, అబ్దుల్లా షఫిక్‌లకు 135 శాతం హైక్‌$6,000)

కేటగిరీ- డి: ఫాహిం ఆష్రఫ్‌, హసన్‌ అలీ, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఇహసానుల్లా, మహ్మద్‌ హ్యారిస్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, సయీమ్‌ ఆయుబ్‌, సల్మాన్‌ అలీ ఆఘా, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సౌద్‌ షకీల్‌, షానవాజ్‌ దహాని, షాన్‌ మసూద్‌, ఉసామా మిర్‌, జమాన్‌ ఖాన్‌లకు 127 శాతం హైక్‌($1,700) 

హైదరాబాద్‌లో పాక్‌ జట్టు
కాగా పీసీబీతో తాజా ఒప్పందంతో బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌ వంటి టాప్‌ ప్లేయర్లకు నెలకు 15,600 అమెరికా డాలర్ల మేర(భారత కరెన్సీలో దాదాపు పన్నెండు లక్షల తొంభై ఏడువేలు) సాలరీ లభించనుంది.

ఇదిలా ఉంటే..  పీసీబీ ప్రకటన నేపథ్యంలో బుధవారం రాత్రే పాక్‌ క్రికెట్‌ జట్టు భారత్‌కు చేరుకోవడం విశేషం. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల నేపథ్యంలో ఇప్పటికే ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది.

చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్‌గా మార్కరమ్‌

మరిన్ని వార్తలు