Pakistan Cricket Board: పీఎస్‌ఎల్‌కే 'దిక్కు దివాణం' లేదు.. మరో లీగ్‌ అవసరమా!

27 Aug, 2022 11:50 IST|Sakshi
Photo Credit: PCB

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఒక్కోసారి పాకిస్తాన్‌ జట్టులాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఆటగాళ్లను గందరోగోళానికి గురి చేయడం వాళ్లకు అలవాటే. చిరకాల ప్రత్యర్థిగా చెప్పుకునే టీమిండియాను నడిపించే బీసీసీఐ ఏం చేస్తే.. దానికి రివర్స్‌గా వ్యవహరిస్తుంటుంది పీసీబీ. క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టగానే.. దానికి పోటీగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)ను తీసుకొచ్చింది. అయితే ఐపీఎల్‌ స్థాయిలో పీఎస్‌ఎల్‌లో అంతగా ఆదరణ పొందలేకపోయింది.

అయినప్పటికి పీఎస్‌ఎల్‌ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. పీఎస్‌ఎల్‌కే ఆదరణ అంతంతగా ఉంటే తాజాగా పాకిస్తాన్‌ జూనియర్‌ లీగ్‌(పీజేఎల్‌) పేరుతో పీసీబీ మరొక కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టనుంది. అక్టోబర్‌ 6న లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పీజేఎల్‌ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. అయితే ఈ పీజేఎల్‌ టోర్నీకి విదేశాలకు చెందిన వివిధ బోర్డులు, క్లబ్స్‌, ప్రొఫెషనల్‌ లీగ్స్‌ నుంచి దాదాపు 140 మంది విదేశీ ప్లేయర్లు లీగ్‌లో ఆడడానికి తమ పేరును దరఖాస్తూ చేశారని పీసీబీ పేర్కొంది.

టోర్నమెంట్‌ డైరెక్టర్‌ నదీమ్‌ ఖాన్‌ మాట్లాడుతూ..'' పాకిస్తాన్‌ జూనియర్‌ లీగ్‌(పీజేఎల్)కు మద్దతు తెలిపిన పలు క్రికెట్‌ బోర్డులకు మా ధన్యవాదాలు. జూనియర్‌ క్రికెట్‌ నుంచే సీనియర్‌ స్థాయికి వెళ్లేదన్న విషయం మరవద్దు. అందుకే జూనియర్‌ స్థాయిలో ఆటగాళ్లకు ఫౌండేషన్‌ బలంగా ఉండాలనే అభిప్రాయంతో పీజేఎల్‌ను ఏర్పాటు చేశాము. విదేశాలకు చెందిన జూనియర్‌ క్రికెటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పాకిస్తాన్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా పాకిస్తాన్‌ జూనియర్‌ లీగ్‌(పీజేఎల్‌)కే భారత్‌ మినహా మిగతా ఎనిమిది టెస్టు హోదా కలిగిన దేశాల నుంచి విరివిగా నామినేషన్స్‌ వచ్చాయని.. వీటితో పాటు ఆస్ట్రియా, బెల్జియం, బెల్జియం, కెనడా, డెన్‌మార్క్‌, నేపాల్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌ లాంటి సభ్య దేశాల నుంచి కూడా చాలా మంది ఆటగాళ్లు తమ పేర్లను పంపించినట్లు పీసీబీ తెలిపింది.కాగా 2003 సెప్టెంబర్‌ 1 తర్వాత పుట్టిన ఆటగాళ్లకు మాత్రమే పాకిస్తాన్‌ జూనియర్‌ లీగ్‌(పీజేఎల్‌)లో ఆడే అవకాశమున్నట్లు పీసీబీ తెలిపింది.

అయితే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త లీగ్‌ను ఏర్పాటు చేయడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి విభిన్న వాదనలు వచ్చాయి. ''పీఎస్‌ఎల్‌కే దిక్కు దివానం లేదు.. మరో కొత్త లీగ్‌ అవసరమా.. క్రికెట్‌లో పెద్దన్నలా భావించే బీసీసీఐకి పోటీగా ఏ టోర్నీని ప్లాన్‌ చేసినా అది వ్యర్థమే అవుతుంది.'' అంటూ పేర్కొన్నారు.

చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌, ఇతర వివరాలు

Asia Cup 2022: అర్హత సాధించామన్న ఆనందం.. 'కాలా చష్మా'తో దుమ్మురేపారు

మరిన్ని వార్తలు