Pele: మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం

20 Apr, 2022 15:12 IST|Sakshi

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే మరోసారి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా పీలే పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిదే. గతేడాది సెప్టెంబర్‌ 2021లో పెద్దప్రేగుకు ఏర్పడిని కణితిని వైద్యులు తొలగించారు. అప్పటినుంచి పీలే..సావోపోలోని ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌​ ఆసుపత్రికి తరచు చికిత్స కోసం వెళ్లి వస్తున్నాడు. తాజాగా సోమవారం నొప్పి మరోసారి ఎక్కువవడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీలే పరిస్థితి బాగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన అబ్జర్వేషన్‌లో కొనసాగుతున్నాడు. కాగా గత ఫిబ్రవరిలో యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కీమోథెరపీ కూడా చేయించుకున్నాడు.

కాగా ఫుట్‌బాల్‌లో పీలేది చెరగని ముద్ర. మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదయింది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్‌ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. 

చదవండి: Wimbledon 2022: రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్లకు షాక్‌.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం!

మరిన్ని వార్తలు