రన్నరప్‌ హరికృష్ణ

30 Jul, 2020 02:35 IST|Sakshi
పెంటేల హరికృష్ణ

బీల్‌ చెస్‌ టోర్నీలో ఓవరాల్‌గా రెండో స్థానం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా క్లిష్ట సమయంలో నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన తొలి ముఖాముఖి అంతర్జాతీయ టోర్నమెంట్‌ బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని బీల్‌ నగరంలో బుధవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ 36.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

37 పాయింట్లతో పోలాండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ రాడోస్లా వొజ్తాసెక్‌ ఓవరాల్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్‌ విభాగాల్లో టోర్నీలు నిర్వహించి... ఈ మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా ఫైనల్‌ ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. హరికృష్ణ ర్యాపిడ్‌ విభాగంలో 10 పాయింట్లు ... బ్లిట్జ్‌ విభాగంలో 6 పాయింట్లు... క్లాసికల్‌ విభాగంలో 20.5 పాయింట్లు స్కోరు చేశాడు. బుధవారం జరిగిన చివరిదైన ఏడో రౌండ్‌ క్లాసికల్‌ గేమ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ హరికృష్ణ 31 ఎత్తుల్లో డేవిడ్‌ గిజారో (స్పెయిన్‌)పై గెలుపొందాడు.

అయితే మరోవైపు వొజ్తాసెక్‌ కూడా తన చివరి రౌండ్‌ గేమ్‌లో తన ప్రత్యర్థి నోయల్‌ స్టుడెర్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించడంతో హరికృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వొజ్తాసెక్‌ గేమ్‌ ‘డ్రా’ అయిఉంటే హరికృష్ణకు టైటిల్‌ లభించేంది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్‌ విభాగంలో విజయానికి 4 పాయింట్లు, ‘డ్రా’కు ఒకటిన్నర పాయింట్లు... ర్యాపిడ్‌ విభాగంలో  విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్‌... బ్లిట్జ్‌ విభాగంలో విజయానికి 1 పాయింట్, ‘డ్రా’కు అరపాయింట్‌ కేటాయించారు. చాంపియన్‌ వొజ్తాసెక్‌కు 10 వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (రూ. 8 లక్షల 20 వేలు), రన్నరప్‌ హరికృష్ణకు 7,500 స్విస్‌ ఫ్రాంక్‌లు (రూ. 6 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఓవరాల్‌ ఫైనల్‌ ర్యాంకింగ్స్‌
1. రాడోస్లా వొజ్తాసెక్‌ (పోలాండ్‌–37 పాయింట్లు); 2. పెంటేల హరికృష్ణ (భారత్‌–36.5 పాయింట్లు); 3. మైకేల్‌ ఆడమ్స్‌ (ఇంగ్లండ్‌–35.5 పాయింట్లు); 4. విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ–28 పాయింట్లు); 5. అర్కాదిజ్‌ నైదిష్‌ (అజర్‌బైజాన్‌–22.5 పాయింట్లు); 6. డేవిడ్‌ గిజారో (స్పెయిన్‌–22 పాయింట్లు); 7. రొమైన్‌ ఎడువార్డో (ఫ్రాన్స్‌–17.5 పాయింట్లు); 8. నోయల్‌ స్టుడెర్‌ (స్విట్జర్లాండ్‌–15 పాయింట్లు).

ఆడటంలోనే ఆనందం దక్కింది...
బీల్‌ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం సంతోషం. త్రుటిలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కోల్పోయాను. అయితే ఎలాంటి నిరాశా లేదు. మూడు ఫార్మాట్‌లలో (ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్‌) కూడా బాగా ఆడాను. బ్లిట్జ్‌లో మాత్రం కాస్త వెనుకబడటంతో ఓవరాల్‌ టైటిల్‌ చేజారింది. మొత్తంగా నా ప్రదర్శన అయితే చాలా బాగుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ విజయాలు, ఫలితాలకంటే ముఖాముఖి చెస్‌ ఆడటంలో నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. ఫిబ్రవరిలో చివరి టోర్నమెంట్‌ బరిలోకి దిగాను.

బీల్‌ నుంచి ‘సాక్షి’తో హరికృష్ణ
► కోవిడ్‌–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మా టోర్నీలు కూడా రద్దు కావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో అనేక కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఓపెనింగ్స్‌పై ఒక పుస్తకం కూడా రాశాను. త్వరలో అది ప్రచురితమవుతుంది.

► ప్రస్తుతం ప్రాగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని)లో ఉంటున్నా. కరోనాకు సంబంధించి స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా పాటించారు. మాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వారే చూసుకోవడం వల్ల మేం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్లిట్జ్‌ మినహా మిగిలిన ఫార్మాట్‌లకు ఇద్దరు ఆటగాళ్ల మధ్య మందమైన ప్లాస్టిక్‌ తెరలాంటిది ఉంచారు. బ్లిట్జ్‌ చాలా వేగంగా ముగిసిపోతుంది కాబట్టి మాస్క్‌లు వేసుకొని ఆడామంతే.

► కరోనా విరామం సమయంలో మూడు ఆన్‌లైన్‌ టోర్నీల్లో పాల్గొన్నాను. అయితే అవి నాకు సంతృప్తినివ్వలేదు. కంప్యూటర్‌ ముందు కూర్చుంటే పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. ఆన్‌లైన్‌ ఆడగలిగే అవకాశం చెస్‌కు ఉన్నా... ఎదురుగా మరో ఆటగాడు కూర్చొని ఉంటేనే ఆ అనుభూతి లభిస్తుంది. ప్రత్యర్థిని చూస్తూ, అతని ముఖకవళికలను పరిశీలించడం కూడా చెస్‌ వ్యూహప్రతివ్యూహాల్లో భాగమే. అందుకే బీల్‌ నిర్వాహకులు పిలవగానే ఆడేందుకు సిద్ధమయ్యా.

► మొత్తంగా బీల్‌ టోర్నీ భిన్నమైన అనుభవమే అయినా మరీ కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు సంతృప్తిగా వెనుదిరుగుతున్నా. ఇప్పుడు ఒలింపియాడ్‌ కోసం సన్నద్ధమవుతా. భారత్‌ ఉన్న గ్రూప్‌ మ్యాచ్‌లు ఆగస్టు 19 నుంచి ఉన్నాయి కాబట్టి నాకు తగినంత సమయం ఉంది. ఒలింపియాడ్‌ కూడా తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నారు. జట్టుగా ఇది ఎలా ఉండబోతోందో అని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

మరిన్ని వార్తలు