వినూత్న నిరసన: ఆట జరుగుతుండగానే మైదానంలో పారాచూట్‌తో ల్యాండింగ్‌

16 Jun, 2021 18:52 IST|Sakshi

మ్యూనిచ్‌: యూరోకప్‌ 2020 ఫుట్‌బాల్‌ పోటీల్లో భాగంగా జర్మనీ, ఫ్రాన్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు ఓ వ్యక్తి వినూత్నంగా నిరసనను ప్రదర్శించాడు. "కిక్‌ అవుట్‌ అయిల్!‌", "గ్రీన్‌ పీస్‌" అని రాసివున్న పారాచూట్‌తో మైదానంలో ల్యాండయ్యాడు. ఆయిల్ వాడ‌కాన్ని ఆపేయాలంటూ నినాదాలు చేశాడు. కాగా, ఈ యూరో క‌ప్‌కు ప్రధాన స్పాన్స‌ర్‌గా ఉన్న ర‌ష్యా ఇంధ‌న ఉత్ప‌త్తి సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్య‌తిరేకంగా గ‌తంలోనూ గ్రీన్‌పీస్‌ స్వచ్ఛంద సంస్థ నిర‌స‌న‌లు తెలిపింది. ఇదిలా ఉంటే, నిరసనకారుడు మైదానంలో పారాచూట్‌తో ల్యాండ్‌ అయ్యే సమయంలో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఫ్రాన్స్‌ కోచ్‌ డిడియర్‌ డెస్చాంప్స్‌ తృటిలో అపాయం నుంచి తప్పించుకున్నాడు. క్షతగాత్రులంతా వార ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పారాచూట్‌ కిందకు దిగే సమయంలో దాని వైర్లు స్టేడియం పైకప్పుకు అనుసంధానంగా ఉన్న ఓవర్ హెడ్ కెమెరాకు తట్టుకోవడంతో ప్రత్యక్ష ప్రసారానికి కాసేపు అంతరాయం కలిగింది. హఠాత్తుగా లైవ్‌ కట్‌ కావడంతో మైదానంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. నిరసనకారుడు చేపట్టిన ఈ చర్యను యురోపియన్‌ సాకర్‌ పాలకమండలి ఖండించింది. నిరసన తెలియజేసిన విధానాన్ని నిర్లక్ష్యం మరియు ప్రమాదకర చర్యగా పేర్కొంది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించి, నిరసనకారుడిపై చర్యలకు ఆదేశిస్తామని యూఈఎఫ్‌ఏ వెల్లడించింది.

చదవండి: గ్రౌండ్‌లో కుప్ప‌కూలిన మరో స్టార్‌ ప్లేయర్‌..

మరిన్ని వార్తలు